Bigg Boss Telugu 5:  ‘రవీ.. నువ్వు మాట్లాడిన ఇంకో వీడియో కూడా ప్లే చేయమంటావా?’ - telugu news here bigg boss telugu 5 saturday episode analysis
close
Updated : 26/09/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5:  ‘రవీ.. నువ్వు మాట్లాడిన ఇంకో వీడియో కూడా ప్లే చేయమంటావా?’

ఇంటర్నెట్‌డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’లో గత వారం రోజులుగా జరిగిన పరిణామాలపై వీకెండ్‌లో నాగార్జున ఎలా స్పందిస్తారా? అన్న ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరపడింది. ఎపిసోడ్‌ మొదలై హౌస్‌మేట్స్‌ కూర్చోగానే ‘అందరిలోనూ ఎన్నో ప్రశ్నలు’ అంటూ సుత్తి పట్టుకుని రవి, ప్రియల పేర్లు రాసిన టైల్స్‌ను పగలగొట్టారు నాగార్జున. ఇక ఏమాత్రం ‘సుత్తి’ కొట్టకుండా నేరుగా పాయింట్‌లోకి  వచ్చేశారు. నామినేషన్స్‌ సందర్భంగా  ప్రియ Vs లహరి, రవిల మధ్య జరిగిన రచ్చపై చర్చ మొదలుపెట్టారు. ‘లహరి కేవలం మెన్స్‌ చుట్టూనే తిరుగుతోంది‌’ అని మొదట ఎవరన్నారో శూలశోధన మొదలు పెట్టారు. లహరిని పవర్‌రూమ్‌లోకి పిలిచి తెరపై అసలు విషయం బయటపెట్టారు. దీంతో స్పష్టత వచ్చిన లహరి ‘మనుషుల వెనకాల మాట్లాడవద్దు. దయచేసి ప్రతి హౌస్‌మేట్‌కు వేడుకుంటున్నా’ అంటూ ప్రాధేయపడింది. ‘రవి మీరు మాట్లాడింది, చేసింది తప్పు’ అనేసరికి అతడు నిర్ఘాంతపోయాడు. ‘తనకు స్పష్టత ఇచ్చినందుకు థ్యాంక్స్‌’ అంటూ ప్రియను లహరి ఆలింగనం చేసుకుంది.

ఆ వీడియో కూడా ప్లే చేయమంటావా!

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో లింగ భేదం లేదు. ఎవరు.. ఎక్కడైనా ఉండవచ్చు’ అంటూ ప్రియను క్లాస్‌ పీకిన నాగ్‌, ‘సింగిల్‌ మెన్‌ అని ప్రియ వద్ద అన్నది మొదట నువ్వే. ఇప్పటికైనా స్పష్టత వచ్చిందా?’ అంటూ రవిని అడిగారు. ‘లేదు సర్‌’ అంటూ ఇంకేదో చెప్పబోయే సరికి ‘నువ్వు మాట్లాడిన ఇంకో వీడియో కూడా ప్లే చేయిస్తా’ అనే సరికి రవి నోటి నుంచి మాట రాలేదు. ఇంకా ఏం మాట్లాడితే ఏం బయటకు వస్తాయోనని రవి అలా చూస్తుండిపోయాడు. ‘వరస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చింది ఎవరంటే నీ పేరు నువ్వే ఎందుకు చెప్పుకొన్నావ్‌‌’ అంటూ మానస్‌కు, ‘ప్రతి దానికీ ఎందుకు ఏడుస్తున్నావ్‌’ అంటూ విశ్వకు నాగ్‌ కాస్త గట్టిగానే డోస్‌ ఇచ్చారు. జెస్సీ కెప్టెన్‌ అయితే నువ్వెందుకు ప్రతి విషయంలోనూ కలగజేసుకుంటున్నావ్‌ అంటూ షణ్ముఖ్‌కు చురకలంటాయి. సిరి నీ ఫ్రెండ్‌షిప్‌ కోసం ఏడుస్తుంటే ఆమెను ఏడిపించటం భావ్యం కాదని షణ్ముక్‌కు గీతోపదేశం చేశారు నాగార్జున. ‘నువ్వు ఇంకా సాధించాలి’ అంటూ ప్రియాంకను పొగడ్తలతో ముంచెత్తడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది.

‘షట్‌ ది డోర్‌ ఆన్‌ ది ఫేస్‌’

బిగ్‌బాస్‌ హౌస్‌లో అర్హతలేని వ్యక్తులను డోరు వెనుక పెట్టి ముఖాన తలుపువేయాలని నాగ్‌ సూచించారు. అత్యధికమంది లోబో ముఖంపై తలుపు వేశారు. ఈ తతంగం సరదాగా సాగింది. ఇంటి సభ్యులపై లోబో.. అతనిపై ఇంటి సభ్యులు వేసిన పంచ్‌లు నవ్వులు పంచాయి. ‘గుంట నక్క ఎవరో ఇప్పటికైనా చెబుతావా’ అంటూ ఈ సందర్భంగా నటరాజ్‌ను అడగ్గా, ‘ఇప్పటికి 99శాతం క్లారిటీ వచ్చింది. ఇంకొకసారి వాళ్లు అదే తప్పు పనిచేస్తే తప్పకుండా పేరు చెబుతా. అంతేకాదు, ఊసరవెల్లి ఎవరో కూడా చెబుతా’ అంటూ చెప్పుకొచ్చాడు.

సేవ్‌ అయిన ప్రియాంక, శ్రీరామచంద్ర

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ప్రియాంక మొదట సేవ్‌ అయింది. ఆ తర్వాత శ్రీరామ్‌ నామినేషన్స్‌ నుంచి బయటపడ్డాడు. మానస్‌, ప్రియ, లహరిలపై ఎలిమినేషన్‌ కత్తి వేలాడుతూనే ఉంది. మరి ఈ ముగ్గురిలో ఎవరు హౌస్‌ నుంచి బయటకు వస్తారో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్‌ చూడాల్సిందే!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని