
చిత్రం: మాస్టర్
నటీనటులు: విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, భాగ్యరాజ్, అర్జున్ దాస్, నాజర్, రమ్య సుబ్రమణియన్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
నిర్మాత: జేవియర్ బ్రిట్టో
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లోకేశ్ కనకరాజ్
బ్యానర్: ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్, సెవెన్ స్క్రీన్స్ స్టూడియో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్
విడుదల: 13-01-2021
తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్. గత కొన్నేళ్లుగాగా ఆయన నటించిన సినిమాలు ఏకకాలంలో తమిళం, తెలుగులో విడుదలవుతున్నాయి. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంచుకునే కథలు, సినిమాలు ఇక్కడి ప్రేక్షకులనూ అలరిస్తున్నాయి. తాజాగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘మాస్టర్’. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యంగా ఈ సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో విజయ్ నటన ఎలా ఉంది? ‘ఖైదీ’తో క్రేజ్ సంపాదించిన లోకేశ్ కనకరాజ్ విజయ్ను ఎలా చూపించారు? ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి మెప్పించారా?
కథేంటంటే: జేడీ (విజయ్) ఓ ప్రొఫెసర్. సెయింట్ జేవియర్ కాలేజ్‌లో పనిచేస్తూ అక్కడ విద్యార్థి సంఘాల ఎన్నికలకి కారణం అవుతాడు. ఆ ఎన్నికల్లో గొడవలు జరగడంతో బాల నేరస్థుల స్టేట్ అబ్జర్వరేషన్ హోమ్‌కి మాస్టర్‌గా వెళ్లాల్సి వస్తుంది. ఆ హోమ్‌ని అడ్డుపెట్టుకుని భవాని (విజయ్ సేతుపతి) అరాచకాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇంతకీ భవాని ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? జేడీ అక్కడి పరిస్థితిని ఎలా చక్కబెట్టాడు. భవానీని ఎలా అడ్డుకున్నాడు? చారు (మాళవిక) ఎవరు?జేడీ జీవితంలో ఆమె స్థానం ఏంటి? అనేదే కథ!
ఎలా ఉందంటే: అగ్ర హీరో... అందులోనూ పెద్దఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ అనే సరికి ఎంత ప్రతిభగల దర్శకులైనా సురక్షితమైన ప్రయాణం వైపే మొగ్గు చూపుతుంటారు. ఆ హీరో అభిమానుల్లో ఒకరిగా ఆలోచిస్తూ సినిమాలు చేస్తుంటారు. అది అభిమానుల్ని అలరించినా.. సగటు ప్రేక్షకుడికి మాత్రం అంతగా రుచించదు. ‘మాస్టర్’ విషయంలోనూ అదే జరిగిందనిపిస్తుంది. విజయ్ తమిళంలో ఎంతోమందికి ఆరాధ్య కథానాయకుడు. ఆయనతో యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సగటు వాణిజ్య కథనే తెరకెక్కించాడు. నువ్వా-నేనా అన్నట్టుండే హీరో- విలన్.. వారిద్దరి మధ్య యుద్ధం. మధ్యలో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ అభిమానుల్ని ఉర్రూతలూగించడం.. ఇలా అలవాటైన పద్ధతుల్లోనే ‘మాస్టర్’ సాగిపోతుంది. ‘ఖైదీ’లో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని రేకెత్తించిన లోకేశ్ కనగరాజ్ ఈసారి మాత్రం, ప్రేక్షకుల బుర్రకి ఏ మాత్రం పని పెట్టకుండా సినిమాని నడిపించేశాడు. ప్రథమార్ధంలో మాస్ అంశాలకి పెద్దపీట వేస్తూ... జేడీగా విజయ్ పాత్ర, భవానిగా విజయ్ సేతుపతి పాత్ర లక్ష్యాల్ని పరిచయం చేస్తూ వచ్చారు.
కథానాయకుడిని చూపించడం మొదలుకొని... అతడిని కాలేజీ వేడుకకి తీసుకురావడం వరకూ అభిమానుల్ని అలరించడం కోసమే అన్నట్టుగా సాగుతుంటాయి సన్నివేశాలు. కథానాయకుడు మాటిమాటికీ వెనక్కి తిరిగి వేసే డ్యాన్సులు, ఆ డప్పు మోతలు అభిమానులతో ఈల కొట్టించొచ్చు కానీ... సగటు సినీ ప్రేక్షకుడికి మాత్రం అవి అంతగా రుచించవు. ప్రథమార్ధం కథ, సన్నివేశాలు చిరంజీవి ‘మాస్టర్’ సినిమాని గుర్తు చేస్తాయి. ద్వితీయార్ధంలోనే భవానీ, జేడీ మధ్య యుద్ధం మొదలవుతుంది. రెండు బలమైన పాత్రలు ఢీ కొన్నప్పుడు ఎత్తులు.. పైఎత్తులు ఆకట్టుకునేలా ఉండాలి. దర్శకుడు ఆ సందర్భంలోనూ సన్నివేశాల్ని సాదాసీదాగానే మలిచాడు. కథానాయకుడు, ప్రతినాయకుడి పాత్రల్ని దేనికదే బలంగా రాసుకోవడంతో బాగా పండాయి. అంతే తప్ప... ఆ రెండింటి మధ్య డ్రామా అంతగా ఆకట్టుకోదు. సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతుంటాయి. కథనంలో ఆ లోపానికి తోడు... సినిమా నిడివి మరీ ఎక్కువైంది. దాంతో ద్వితీయార్ధం సాగదీతలా అనిపిస్తుంది. బాల నేరస్థుల అబ్జర్వేషన్ హోమ్ నేపథ్యంలో ఈ కథని నడిపిన విధానం మాత్రం కాస్త కొత్తదానన్ని పంచుతుంది.
ఎవరెలా చేశారంటే: కథానాయకుడు విజయ్ చేసింది మాస్టర్ పాత్ర అన్న మాటే కానీ.. అందులోనూ ఊర మాస్ అనిపిస్తారు. ప్రథమార్ధంలో పచ్చి తాగుబోతుగా చూపించడమే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, ఆ పాత్ర సాగే విధానానికి తగ్గట్టుగా చక్కగా ఒదిగిపోయారు విజయ్. ఇక ప్రతినాయకుడి పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ. విజయ్ సేతుపతి భవానీ పాత్రకి ప్రాణం పోశారు. ఎమోషనల్ అవుతూనే... దారుణాలు చేయడం ఆకట్టుకుంటుంది. చారు పాత్రలో కథానాయిక మాళవిక మోహనన్ మెరుస్తుంది. ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, తెరపై కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సినంత ఏమీ లేదు. ఎడిటింగ్ మినహా సాంకేతికంగా అన్ని విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. అనిరుధ్ సంగీతం ఆకట్టుకుంటుంది. కెమెరా పనితనం మెప్పిస్తుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కొన్ని సన్నివేశాల్లో చక్కటి పనితీరుని కనబరిచారు. భావోద్వేగాలు పండించడంపైనా, కథని ఆసక్తికరంగా నడిపించడంపైన కూడా దృష్టి పెట్టుంటే బాగుండేది.
బలాలు | బలహీనతలు |
+ కథా నేపథ్యం + విజయ్, విజయ్ సేతుపతి నటన + సంగీతం |
- ప్రేక్షకుల ఊహలకు తగ్గట్టుగా సాగే కథ - సాగదీతగా అనిపించే సన్నివేశాలు |
చివరిగా: అభిమానులను అలరించే ‘మాస్టర్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి