రివ్యూ: చక్ర - vishal chakra telugu movie review
close
Published : 19/02/2021 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ: చక్ర

చిత్రం: చక్ర; నటీనటులు: విశాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, రెజీనా, శ్రుతి డాంగే,రోబో శంకర్‌, మనోబాల తదితరులు; సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా; సినిమాటోగ్రఫీ: కె.టి.బాలసుబ్రహ్మణ్యం; ఎడిటింగ్‌: త్యాగు; బ్యానర్‌: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ; నిర్మాత: విశాల్‌; రచన, దర్శకత్వం: ఎం.ఎస్‌.ఆనందన్‌; విడుదల: 19-02-2021

సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశాల‌కు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. ఆ మ‌ధ్య ఇలాంటి ఓ ఆస‌క్తిక‌ర క‌థాంశాన్నే ‘అభిమ‌న్యుడు’తో ప్రేక్ష‌కుల‌కు చూపించి హిట్ ట్రాక్ ఎక్కారు క‌థానాయ‌కుడు విశాల్‌. కానీ, ఆ త‌ర్వాత ఆ జోరు కొన‌సాగించ‌లేక‌పోయారు. ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టేందుకు ఆయ‌న మ‌రోసారి ‘చ‌క్ర’ చిత్రంతో అదే దారిలో న‌డిచారు. ట్రైల‌ర్లు, టీజ‌ర్లు ‘అభిమ‌న్యుడు’ త‌ర‌హాలో ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం.. విశాల్ దీన్ని స్వయంగా నిర్మించ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  మ‌రి ఈ శుక్ర‌వారమే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం సినీ ప్రియుల మెప్పు పొందిందా? ఈ సినిమాతో ఆయ‌న‌ మ‌ళ్లీ హిట్  ట్రాక్ ఎక్కారా?

క‌థేంటంటే: దేశంలో 73వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ‌..  హైద‌రాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ఒకేసారి 50 ఇళ్లల్లో దొంగతనం జరుగుతుంది. ఇద్ద‌రు ముసుగు వ్య‌క్తులు బైకుల‌పై వ‌చ్చి ఆ దొంగ‌త‌నాలు చేస్తారు. ఆ కేసును చేధించే బాధ్య‌త‌ను ఏసీపీ గాయత్రి(శద్ధా శ్రీనాథ్)కి అప్పగిస్తారు. ఆ దొంగ‌త‌నాలు జరిగిన ఇళ్లల్లో సైనికుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ చంద్ర(విశాల్) నివాసం కూడా ఉంటుంది. చంద్ర తండ్రికి భారత ప్రభుత్వం ప్రదానం చేసిన అశోక చక్ర మెడల్ ఆ దోపిడీలోనే చోరీకి గురవుతుంది. దీంతో చంద్ర కూడా ఆ కేసును ఛేదించేందుకు గాయ‌త్రితో పాటు రంగంలోకి దిగుతాడు. స్థానిక పోలీసులతో కలిసి దొంగలను వెతికే పనిలో పడతాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను ఓ మాస్ట‌ర్ మైండ్ సైబ‌ర్ నేర‌గాడితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. మ‌రి ఈ దోపిడీ వెన‌కున్న ఆ మాస్ట‌ర్  మైండ్ క్రిమిన‌ల్ ఎవ‌రు? ఆ వ్య‌క్తిని  చంద్ర ఎలా పట్టుకున్నాడు? తన తండ్రి సాధించిన అశోక చక్ర మెడల్‌ తిరిగి ఎలా సంపాదించాడు? ఈ క‌థ‌లో లీలా(రెజీనా)  పాత్ర ఏంటి?

ఎలా ఉందంటే: క‌థ.. క‌థ‌నాలు, విశాల్ పాత్ర.. సినిమా సాగే తీరు చూస్తున్న‌ప్పుడు చ‌క్ర ఆద్యంతం అభిమ‌న్యుడుకి సీక్వెల్‌లాగే క‌నిపిస్తుంది. అయితే ఎంచుకున్న సైబ‌ర్ క్రైం క‌థాంశం కాస్త భిన్న‌మైన‌ది అంతే. ఈ డిజిట‌ల్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్‌లు, టెలీకాలింగ్ సంస్థ‌లు.. ఇత‌ర‌త్రా ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారం.. ఎలా దుర్వినియోగం అవుతుందో.. దాని వ‌ల్ల ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ ఎలాంటి సైబ‌ర్ నేరాల బారిన ప‌డుతున్నారో ఆక‌ట్టుకునేలా చెప్పే ప్ర‌య‌త్నమే ‘చక్ర’. సినిమా ప్రారంభిస్తూనే ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల్ని క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. తొలి స‌న్నివేశంలోనే న‌గ‌రంలో వరుస చోరీలు జ‌ర‌గ‌డం.. ఈ క్రమంలో వారిని ప‌ట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడం.. ఈ క్లిష్ట‌మైన కేసును  ఛేదించేందుకు ఏసీపీ గాయ‌త్రిని రంగంలోకి దించ‌డం.. ఆమె వెన‌కాలే చంద్రు ఆ కేసులో భాగం కావ‌డం.. ఇలా స్ర్కీన్ ప్లేని చ‌క‌చ‌కా ప‌రుగులు పెట్టించాడు.

ఆ త‌ర్వాత విశాల్ త‌న  తెలివితేట‌లు ఉప‌యోగించి కేసులోని చిక్కుముడుల‌ను ఒక్కొక్కటిగా విప్ప‌డం.. త‌ర్వాత డ‌య‌ల్ యువ‌ర్ హెల్ప్ అనే యుటిలిటీ స‌ర్వీస్‌ని ఆధారం చేసుకొని తెర వెనుక నుంచి ఓ సైబ‌ర్ క్రిమిన‌ల్ ఈ దాడికి పాల్ప‌డుతున్న‌ట్లు గుర్తించ‌డం.. వంటి స‌న్నివేశాల‌తో ప్ర‌థమార్ధాన్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దాడు.  స‌రిగ్గా విరామ స‌మ‌యానికి ఈ నేరం వెనుక లీలా ఉన్న‌ట్లు చూపించి ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తిని రేకెత్తించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక  ద్వితీయార్ధంలో.. లీలా  నేప‌థ్యం‌, విశాల్ ఆమెను ప‌ట్టుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు, ఈ క్ర‌మంలో ఒక‌రికొక‌రు వేసే ఎత్తులు పై ఎత్తులు చూపించారు. అయితే ఇద్ద‌రి మ‌ధ్య పోరు సాదాసీదాగా సాగ‌డం..  మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చే సాగ‌తీత స‌న్నివేశాల‌తో ద్వితీయార్ధం పేల‌వంగా సాగుతున్న‌ట్లు అనిపించింది. ముఖ్యంగా ముగింపు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది. ఇంటర్వెల్‌ తర్వాత హీరో-విలన్‌ మధ్య ఎత్తుకు పైఎత్తులు ఉంటాయని ఆశించిన ప్రేక్షకుడు కాస్త నిరాశకు గురవుతాడు.

ఎవ‌రెలా చేశారంటే:  విశాల్ మ‌రొక‌సారి శ‌క్తిమంత‌మైన మిల‌ట‌రీ అధికారిగా త‌న‌దైన శైలిలో మెప్పించాడు. కేసుని ఛేదించే క్ర‌మంలో ఆయ‌న వేసే ఎత్తులు.. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న‌, చెప్పే సంభాష‌ణలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. ఏసీపీ గాయ‌త్రిగా శ్ర‌ద్ధా చ‌క్క‌టి అభిన‌యాన్ని చూపించింది. తెర‌పై త‌న అంద‌చందాల‌తో మాయ చేస్తూనే.. అక్క‌డ‌క్క‌డా యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ అద‌ర‌గొట్టింది. ఇక ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో రెజీనా క‌నిపించిన తీరు.. ప‌లికించిన హావ‌భావాలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. మిగిలిన న‌టీన‌టులంతా పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

దర్శకుడు ఆనందన్‌ ఎంచుకున్న క‌థ, ప్ర‌ధమార్ధాన్ని ప‌రుగులు పెట్టించిన తీరు మెప్పిస్తుంది. కానీ, సెకండాఫ్‌కు వ‌చ్చాక క‌థ‌పై త‌న ప‌ట్టును కోల్పోయిన‌ట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా జీడిపాకంలాంటి సాగ‌తీత స‌న్నివేశాలతో ముగింపును సాదాసీదాగా మార్చివేసినట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి తెర వెనుక హీరోలుగా నిలిచిన వాళ్ల‌లో సంగీత ద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజాను మొద‌ట‌గా చెప్పుకోవాలి. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కి త‌న నేప‌థ్య సంగీతంతో కావాల్సినంత బ‌లాన్ని అందించాడు. కేటీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది. త్యాగి క‌త్తెర‌కి కాస్త ప‌ని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ విశాల్ న‌ట‌న‌ - ద్వితీయార్ధం
+ ఎంచుకున్న క‌థాంశం - విసుగు పుట్టించే ముగింపు
+ ప్ర‌థ‌మార్ధం  

చివ‌రిగా: ‘చక్ర’ వ్యూహం ద్వితీయార్ధంలో ఫలించలేదు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని