close
సినిమా రివ్యూ
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రివ్యూ: వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌

చిత్రం: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వర్య రాజేష్‌, ఇజాబెల్లె, కేథ‌రిన్, ప్రియ‌ద‌ర్శి, జ‌య‌ప్రకాష్‌, శ‌త్రు, విష్ణు త‌దిత‌రులు
స‌ంగీతం: గోపీసుంద‌ర్‌
ఛాయాగ్రహ‌ణం: జ‌య‌కృష్ణ గుమ్మడి
నిర్మాత‌: కె.ఎ.వ‌ల్లభ‌
స‌మ‌ర్పణ: కె.ఎస్‌.రామారావు
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: క్రాంతిమాధ‌వ్
విడుద‌ల‌: 14 ఫిబ్రవ‌రి 2020

ప్రేమికుల రోజున ప్రేమ‌క‌థ‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ సినిమా అంటే యువ‌త‌రంలో ప్రత్యేక‌మైన ఆస‌క్తి క‌న‌బడుతుంటుంది. ఇక ఆయ‌న ప్రేమ‌క‌థతో చేసిన సినిమా అంటే ఆ ఆస‌క్తి మ‌రింత పెరిగిపోతుంది. ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ అనే పేరులోనే విజ‌య్ మార్క్ క‌నిపిస్తుంది. ఇందులో న‌లుగురు హీరోయిన్లతో క‌లిసి న‌టించాడాయ‌న‌. ఇది నా చివ‌రి ప్రేమ‌క‌థ కావొచ్చని సినిమా వేడుక‌ల్లో చెప్పుకొచ్చాడు. మ‌రి ‘వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’గా విజ‌య్ ఎలాంటి హంగామా చేశాడు? ఆయ‌న ప్రేమ‌క‌థ‌లు ఎలా ఉన్నాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే...

క‌థేంటంటే: గౌత‌మ్(విజ‌య్ దేవ‌ర‌కొండ), యామిని (రాశిఖ‌న్నా) ఒక‌రినొక‌రు ఇష్టప‌డ‌తారు. పెళ్లి చేసుకుంటే కొన్ని స‌మ‌స్యలొస్తాయ‌ని స‌హ‌జీవ‌నం మొద‌లుపెడ‌తారు. గౌత‌మ్ ర‌చ‌యిత‌గా ఎద‌గాల‌నే ప్రయ‌త్నంలో ఉంటాడు. ఉద్యోగం కూడా చేయ‌డు. త‌నదైన ప్రపంచంలోనే బ‌తుకుతుంటాడు. ఈ క్రమంలో యామినిని కూడా ప‌ట్టించుకోడు. అత‌ని ప్రవ‌ర్తనపై విర‌క్తి చెందిన యామిని విడిపోవాల‌ని నిర్ణయించుకుంటుంది. గౌత‌మ్ ఎంత బ‌తిమాలినా వినిపించుకోదు. ప్రేమ విఫ‌ల‌మైన ఆ బాధ‌లోనే గౌత‌మ్ ఒక ప్రేమ‌క‌థ రాయ‌డం మొద‌లుపెడ‌తాడు. ఆ కథ ఎవ‌రిది? రాశాక దానికి ఎలాంటి స్పంద‌న ల‌భించింది? గౌత‌మ్ యామిని మ‌ళ్లీ క‌లిశారా లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే. 

ఎలా ఉందంటే: మూడు క‌థ‌ల స‌మాహారం ఈ చిత్రం. గౌత‌మ్‌, యామినిల క‌థే ప్రధానమైన‌ది. దానికి శీనయ్య (విజ‌య్ దేవ‌ర‌కొండ) - సువ‌ర్ణ (ఐశ్వర్యా రాజేష్‌), గౌత‌మ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ) - ఈజా (ఈసాబెల్లె) జంట‌ల క‌థల్ని ముడిపెట్టిన విధానమే ఆస‌క్తికరం. ప్రేమ‌క‌థ‌ల‌కి నాయ‌కానాయిక‌ల మ‌ధ్య కెమిస్ట్రీ ఎంత కీల‌క‌మో, భావోద్వేగాలు అంత కీల‌కం. ఈ సినిమాని భావోద్వేగాలే ప్రధానంగా తీర్చిదిద్దాడు ద‌ర్శకుడు. గౌత‌మ్‌, యామినిల స‌హ‌జీవ‌నంతో మొద‌లుపెట్టి నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లాడు. ఎన్నో ఆశ‌ల‌తో జీవితాన్ని మొద‌లుపెట్టి, నీరుగారిపోయిన ఒక అమ్మాయి బాధ‌ని రాశీఖ‌న్నా పాత్రలో చూపెట్టే ప్రయ‌త్నం చేశారు. న‌చ్చలేదంటే నిర్మొహ‌మాటంగా చెప్పేసి మ‌ళ్లీ మొహం చూపించ‌కుండా వెళ్లిపోయే ప్రేమికులున్న ఈ రోజుల్లో.. నిత్యం క‌న్నీళ్లతో క‌నిపించే యామిని పాత్రని, ఆమె బాధ‌ని చూడ‌టం కొన్నిచోట్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ పాత్రతోనే స‌ర్దుకుపోవ‌డం అనే ల‌క్షణాన్ని చూపించాల‌నే ప్రయ‌త్నం చేశాడని చివ‌ర్లో తెలుస్తుంది. ఆ జంట బ్రేక‌ప్ త‌ర్వాత శీన‌య్య‌, సువ‌ర్ణల క‌థ మొద‌ల‌వుతుంది. అది సినిమాకి హైలెట్‌గా నిలిచింది. బొగ్గు గ‌నులు, ఇల్లెందు నేప‌థ్యంలో అత్యంత స‌హ‌జంగా సాగే ఆ క‌థ‌లో మంచి హాస్యం కూడా పండింది. భావోద్వేగాలు కూడా ఆ క‌థ‌లోనే బాగా పండాయి. ఆ త‌ర్వాత పారిస్ నేప‌థ్యంలో సాగే గౌత‌మ్‌, ఈజాల ప్రేమ‌క‌థ అయితే మ‌రీ ఇరికించిన‌ట్టుగా, క‌థ‌తో ఏమాత్రం సంబంధం లేన‌ట్టుగా అనిపిస్తుంది. అందులో ఈజాకి క‌ళ్లు పోవ‌డం, గౌత‌మ్ దానం చేయ‌డంలో కూడా లాజిక్ క‌నిపించ‌దు. బ‌తికున్న మ‌నిషి క‌ళ్లని ఎలా దానం చేస్తారు? దానికి చ‌ట్టాలు ఒప్పుకుంటాయా? ఇలాంటి ప్రశ్నలు త‌లెత్తితే అది ప్రేక్షకుడి త‌ప్పు కాదు.

ద‌ర్శకుడు చాలా చోట్ల స్వేచ్ఛని తీసుకుని క‌థ‌ని ముందుకు న‌డిపించాడు. ప‌తాక స‌న్నివేశాల్ని కూడా అల‌వాటైన ప‌ద్ధతిలోనే తీర్చిదిద్దారు. ప్రేమ‌లో దైవ‌త్వం ఉంటుంది. త్యాగాలు ఉంటాయి, స‌ర్దుకుపోవ‌డాలు ఉంటాయ‌నే విష‌యాల్ని మిగ‌తా రెండు క‌థ‌ల ద్వారా చెప్పే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. కానీ అవి దేనిక‌వే ఉప‌క‌థ‌లుగా అనిపిస్తాయి త‌ప్ప‌.. అస‌లు క‌థకి ఫీల్‌ని తెప్పించ‌లేక‌పోయాయి. అదే ఈ సినిమాకి మైన‌స్‌గా మారింది. తెర‌పై క‌నిపించే క‌థ‌లో ప్రేక్షకుడు త‌న‌ని తాను చూసుకోవాలి. త‌న‌కి జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లే అనేలా ఉండాలి. ఈ సినిమాలో ఒక క‌థ‌లో మాత్రమే అలా అనిపిస్తుంది. క్రాంతిమాధ‌వ్ ర‌చ‌యిత‌గా త‌న క‌లం బ‌లాన్ని ప్రద‌ర్శించారు. ఒక ప్రేమ‌క‌థ‌కి మ‌రో రెండు క‌థ‌ల్ని జోడించి చెప్పడం ఆక‌ట్టుకుంటుంది. రచ‌యిత‌గా మ‌రోసారి త‌న ప్రతిభ‌నైతే చూపెట్టాడు కానీ.. ద‌ర్శకుడిగా మాత్రం ఆయ‌న పూర్తిస్థాయిలో సినిమాపై ప‌ట్టుని ప్రద‌ర్శించ‌లేక‌పోయారు.

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్ దేవ‌ర‌కొండ మూడు కోణాల్లో సాగే పాత్రలో క‌నిపిస్తాడు. ప్రతి పాత్రపైనా త‌న‌దైన ముద్ర వేశాడు. మిగ‌తా రెండు పాత్రలు గ‌త సినిమాల‌కి ద‌గ్గర‌గా అనిపించినా... శీన‌య్యగా ఆయ‌న న‌ట‌న మాత్రం ఆక‌ట్టుకుంటుంది. యామిని పాత్రలో రాశీఖ‌న్నా చ‌క్కటి భావోద్వేగాలు పండించింది. ఘాటైన స‌న్నివేశాల్లోనూ క‌నిపించింది. ఐశ్వర్య రాజేష్.. సువ‌ర్ణ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె త‌ప్ప మ‌రొక‌ర్ని ఊహించుకోలేని విధంగా ఆమె పాత్రని పండించింది. ఈజా, కేథ‌రిన్‌లు చిన్న పాత్రల్లోనే క‌నిపించారు. శ‌త్రు, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా కొన్ని విభాగాలు మాత్రమే ప్రభావం చూపించాయి. ముఖ్యంగా సంగీతం సినిమాకి మైన‌స్‌గా మారింది. ప్రేమ‌క‌థ‌ల‌కి సంగీత‌మే బ‌లం. ఇందులో ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. నేప‌థ్య సంగీతం మాత్రం మెప్పిస్తుంది. జ‌య‌కృష్ణ గుమ్మడి కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ర‌చ‌యిత‌గా క్రాంతిమాధ‌వ్ అడుగ‌డుగునా త‌న ప్రభావం చూపించారు. ద‌ర్శకుడిగా మాత్రం ఆయ‌న రాసుకున్న క‌థ, మాట‌ల స్థాయిలో భావోద్వేగాల్ని పంచ‌లేక‌పోయారు. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. 

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న  -ద్వితీయార్ధం 
+ఇల్లెందు నేప‌థ్యంలో క‌థ   
+ప్రథ‌మార్ధం   

చివ‌రిగా: ఈ ల‌వ‌ర్ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ స్థాయి కాదు 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.