close

తాజావార్తలు

నా తలరాత ఇంతేనని నాన్న తిట్టారు

ఇప్పుడు పోస్టర్‌ను పట్టుకుని అందరికీ చూపిస్తున్నారు
‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేం నవీన్‌ పోలిశెట్టి

హైదరాబాద్‌: సినిమాల్లో అంతగా అనుభవం లేని ఓ యువకుడు ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. ఆయనే ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేం నవీన్‌ పోలిశెట్టి. యూట్యూబర్‌గా, థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన నవీన్‌కు ఇది తొలి సినిమా. డిటెక్టివ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా గత శుక్రవారం విడుదలై తెలుగులో మంచి టాక్‌ అందుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన జీవితం గురించి సినిమాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తొలి సినిమాలోనే డిటెక్టివ్‌ నేపథ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు?

నవీన్‌: దర్శకుడు స్వరూప్‌ నుంచి నాకు ఓ రోజు మెసేజ్‌ వచ్చింది. ఒక మంచి స్క్రిప్ట్‌ ఉంది అన్నారు. సినిమా పేరేంటి? అని అడిగాను. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అన్నారు. ఇదేం టైటిల్‌ అని షాకయ్యా. ఎందుకంటే ఇంత పెద్ద టైటిల్‌ పోస్టర్‌ మీద సరిపోదనుకున్నా. ఇదో డిటెక్టివ్‌ నేపథ్యంలోని సాగే సినిమా అని అన్నారు. ఆ పాయింట్‌ విని సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే తెలుగులో ‘చంటబ్బాయి’ తర్వాత అలాంటి నేపథ్యం ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదు. అదీకాకుండా 50 ఏళ్ల వారికి కూడా అర్థమయ్యేలా స్వరూప్ రాసుకున్న క్లియర్‌ స్క్రిప్ట్‌ పిచ్చిగా నచ్చేసింది. సినిమా చేయడానికి నాకు స్ఫూర్తి మాత్రం మా అమ్మ. ఎందుకంటే ఆమె మా ఇంట్లో పెద్ద డిటెక్టివ్‌. 

యూట్యూబర్‌ జర్నీ నుంచి పూర్తిగా సినిమాల వైపు వచ్చేశారు. ఒత్తిడిగా అనిపించలేదా?
నవీన్‌: చదువైపోగానే నేను ఫుల్‌ టైం యాక్టింగ్‌పై దృష్టిపెట్టాలనుకున్నా. ఎలాగైనా సరే బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ సినిమాలో ఛాన్స్‌ సంపాదించాలని ముంబయి వెళ్లాను. కానీ అవకాశం అంత సులువుగా రాదని తెలిసింది. అందుకే యూట్యూబర్‌గా, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, రైటర్‌గా ఎన్నో మార్గాలు ఎంచుకుని మొత్తానికి సినిమాల్లోకి వచ్చి పడ్డాను.

నెల్లూరులోనే మొత్తం సినిమాను చిత్రీకరించాం అంటున్నారు. అక్కడ మీకు ఎదురైన క్రేజీ అనుభవం ఏంటి?
నవీన్‌: నెల్లూరులో షూటింగ్‌ అనగానే టీం అంతా చాలా ఎగ్జైట్‌ అయింది. తీరా వెళ్లేసరికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎండకు మాడిపోయాం. అదీకాకుండా నేను సినిమా కోసం నాలుగు లేయర్లు ఉన్న సూట్‌ వేసుకున్నాను. తొలి రోజు మాత్రం అందరం చాలా యాక్టీవ్‌గా ఉన్నాం. రాన్రాను ఒక్కొక్కరు వేడికి తట్టుకోలేక కళ్లు తిరిగిపడిపోయేవారు. ఇక్కడ నేను ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మాకు వాళ్లు ఎంత సపోర్ట్‌ చేశారంటే.. ఓ వీధిలో మేం సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు ఓ ఇంట్లోని నలుగురు వ్యక్తులు బయటికి వచ్చారు. ఏం కావాలి? అని అడిగారు. మాకు ఓ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి ఓ హాలు కావాలి అని అడిగాం. అందుకు వారు వెంటనే.. ‘మా ఇల్లు వాడుకోండి’ అని చెప్పి మమ్మల్ని లోపలికి పంపించి వాళ్లు అరగంట పాటు ఎండలో నిలబడ్డారు.
మీ జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌ ఏంటి?
నవీన్‌: నాకు సంబంధించినంత వరకు నా జీవితంలోని టర్నింగ్‌ పాయింట్‌ ఏంటంటే.. మనం ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు ఫలితాలు అనుకున్నట్లు వెంటనే రాకపోతే ముందు మనింట్లో వారు చింతిస్తారు. ఆ తర్వాత చుట్టుపక్కల వారు ప్రశ్నించడం మొదలుపెడతారు. ముందు మనం ఎదగాలంటే ఇలాంటి వాళ్లను పట్టించుకోకూడదన్నది నేను దృఢంగా నమ్మే పాయింట్‌. ఎందుకంటే ఎవరో భయపడుతున్నారు, చింతిస్తున్నారు అని చెప్పి మనం తొందరపడి ఏవేవో చేయాలనుకుంటాం. దాని వల్ల కష్టాలు తప్పవు. మరో పాయింట్‌ ఏంటంటే.. నేను నటుడ్ని అవ్వాలంటే కేవలం ఆడిషన్లకు వెళ్లి వారి ఫోన్‌ కాల్స్‌ కోసం ఎదురు చూడగానే సరిపోదు. నాకు అవకాశాలు వచ్చే వరకు అందుకు దోహదపడే అంశాలపై పనిచేయాలి.

మీ నాన్న గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నట్లున్నాయి!
నవీన్‌: అవును. నేను యాక్టర్‌ అవుతానని నాన్నతో చెప్తే.. ‘నువ్వు సాఫ్ట్‌వేర్‌ అవ్వాలి. అదే నీ తలరాత అంతే. ఇదే రాసుంది. అదే నీ రక్తంలోనూ ఉంది’ అన్నారు. ఇదేంట్రా బాబూ.. అనుకున్నాను. ఆయన కోసమే లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వస్తే వెళ్లాను. అక్కడ మా బాస్ అదేంటి? ఇదేంటి? అంటూ ప్రశ్నలతో చంపేసేవాడు. ఇలా కాదని చెప్పి నటనపై దృష్టిపెట్టాలని బెంగళూరు వెళ్లాను. ఈ విషయం నాన్నకు చెప్పలేదు. తెలిస్తే తిడతారు. అందుకే వర్క్‌ ఫ్రం హోం పెట్టుకుని పనిమీద బెంగళూరు వచ్చానని చెప్పాను. కానీ నాన్న రోజూ ఫోన్‌ చేసి లండన్‌ ఎప్పుడు వెళుతున్నావ్‌? అనేవారు. చాలా రోజుల నుంచి బెంగళూరులోనే ఉంటున్నానని నాన్నకు అనుమానం వచ్చి నన్ను ఇంటికి రమ్మన్నారు. ‘బొమ్మరిల్లు’ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, సిద్ధార్థ్‌కు మధ్య వచ్చే సన్నివేశం నాకు రియల్‌ లైఫ్‌లో జరిగింది. నేను లండన్‌ వెళ్లట్లేదు అని నాన్నకు చెప్పగానే ఆయన షాక్‌. ఆయన భయమేంటంటే.. మాకు పెట్టుబడి పెట్టి సినిమా తీసే స్తోమత లేదు. ఇండస్ట్రీలో సాయం చేసేవారూ లేరు. ఎలా రాణిస్తానన్న భయం ఆయనది. మాటల మధ్యలో ఆయనకు యూట్యూబ్‌లో హిట్టయిన నా వీడియో గురించి చెప్పాను. ఇంత పాపులర్‌ అయిందంటే.. నాలో ఏదో టాలెంట్‌ దాగి ఉన్నట్లే కదా అని నమ్మారు. ఇప్పుడు నేను చేసిన ‘ఏజెంట్‌.. ఆత్రేయ’ సినిమా కూడా మంచి టాక్‌ అందుకుంది కాబట్టి ఆయనకు నాపై పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆయన నా పోస్టర్‌ను ఫోన్‌ వాల్‌ పేపర్‌గా పెట్టుకుని తన స్నేహితులకు చూపించడం మొదలుపెట్టారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.