close

తాజావార్తలు

జనాలుంటే సిగ్గుపడేవాడిని: వరుణ్‌ తేజ్‌

చిరు బయోపిక్.. చరణ్‌ కాదంటే చేస్తా!

హైదరాబాద్‌: లొకేషన్‌లో ఎక్కువ మంది జనాలుంటే నటించేందుకు సిగ్గుపడేవాడినని యువ కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ అన్నారు. ఆయన నటించిన సినిమా ‘వాల్మీకి’. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థ నిర్మించింది. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందించారు. సెప్టెంబరు 20న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో వరుణ్‌ విలన్‌ ఛాయలున్న పాత్రలో నటించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి.. 

ప్రేమకథలే వచ్చాయి
‘ఫిదా’,‘తొలిప్రేమ’ తర్వాత కాస్త సమయం తీసుకోవాలి అనుకున్నా. నటుడిగా నేను కాస్త విభిన్నమైన ప్రయోగాలు చేయడానికే ఇష్టపడతా. ఈ రెండు సినిమాల తర్వాత నా వద్దకు అన్నీ ప్రేమకథలే వచ్చాయి. కానీ నేను తమిళ సినిమా ‘జిగర్తాండ’ను ఎంచుకున్నా. ఈ రీమేక్‌లో 50 శాతం మార్పులు చేశాం. క్యారెక్టరైజేషన్‌ కొత్తగా ఉండేలా చూసుకున్నాం. ఫ్లాష్‌బ్యాక్‌లో కొన్ని సీన్లు అదనంగా జోడించాం. అదే పూజా హెగ్డే పార్ట్‌.

ఆ ఆలోచన రాలేదు
‘వాల్మీకి’లో నా పాత్ర ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. ‘లోఫర్‌’లో కూడా నా పాత్ర మాస్‌గా ఉంటుంది. కానీ దానికి కొంత క్లాస్‌ టచ్‌ ఇచ్చాం. కానీ ఇందులో పూర్తిగా మాస్‌గా కనిపిస్తా. ఈ సినిమా వరకూ నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ‘మేకప్‌ వేసుకోవాలి, అందంగా ఉండాలి, బాగా కనిపించాలి’ అనే ఆలోచన రాలేదు.

సలహా ఇచ్చారు
నా కుటుంబంలో ఇంకా ‘జిగర్తాండ’ చూడలేదు. ఈ కథ ఒప్పుకున్న తర్వాత కొందరు ఆలోచించి సినిమా చెయ్‌.. అని జాగ్రత్తలు చెప్పారు. కానీ నేను నమ్మకంగా ఉన్నాను. ఆపై.. ఇంత మూర్ఖంగా ఎందుకు ఉండాలి, ఓసారి స్క్రిప్టును డాడీ చిరంజీవికి చూపిద్దాం అనుకున్నా. ఫోన్‌ చేసి, కథ వింటారా? అని అడిగా. ఆపై హరీష్‌తో కలిసి వెళ్లాను. ‘నువ్వు హీరో కదా, విలన్‌గా సరిపోతావా?’ అని చిరు ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. కథ బాగుందని చెప్పారు. కొన్ని సలహాలు ఇచ్చారు. హరీష్‌ వాటిని సినిమాలో అప్లై చేశారు.

కసరత్తులు చేయలేదు
ఇందులో నా పాత్ర మొరటుగా ఉంటుంది. తెలంగాణ యాసలో నా డైలాగ్‌లు ఉంటాయి. ‘ఎఫ్‌ 2’లో నేను తెలంగాణ యాసలో మాట్లాడాను కానీ.. ఈ రేంజ్‌లో కాదు. రోజూ ఉదయం లొకేషన్‌లో హరీష్‌తో కలిసి డైలాగ్‌లు చదువుకునేవాడిని. ఆయన చాలా సహాయం చేశారు. ప్రత్యేకంగా హోంవర్క్‌ ఏమీ చేయలేదు. హరీష్‌ పనిపరంగా వేగంగా ఉంటారు. నేను కూడా వేగంగానే పనిచేస్తా. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయాలంటే మనకు కూడా ఉత్సాహం వస్తుంది.

సిగ్గుపడ్డా
నా తొలి సినిమా ‘ముకుంద’ సమయంలో ఎక్కువ మంది జనం ఉన్నారని కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడ్డా. కానీ ఇవాళ అలా లేను. అనుభవం కొన్ని నేర్పిస్తుంది. ఇది నా ప్రారంభం.. ఇంకా ఎంతో ప్రయాణం చేయాల్సి ఉంది. విభిన్న కథలు, పాత్రలు చేయాలని నాకు ఉంది. కానీ రావాలి కదా?.. ఓ విధంగా ఈ విషయంలో నేను అదృష్టవంతుడినే. హీరో విలన్‌గా ఉంటే ఎలా ఉంటుందని నేను అనుకుంటున్న సమయంలో ఈ కథతో నా వద్దకు వచ్చారు.

అందుకే రీమేక్‌ చేశాం
‘జిగర్తాండ’లో నటుడిని కాపీ కొట్టే ప్రయత్నం నేను చేయలేదు. ఆ సినిమాలో అతడు అద్భుతంగా నటించి, జాతీయ అవార్డు అందుకున్నారు. ఇది పూర్తిగా ఓ విభిన్నమైన సినిమా. రీమేక్‌ ఎందుకు తీశారని చాలా మంది అడిగారు. ఇది ఓ మంచి సినిమా. అయినా ఎక్కువ మందికి రీచ్‌ అవలేదనేది మా ఉద్దేశం. అందుకే తీశాం. తమిళ సినిమా చూసిన వారికి ఇది నచ్చుతుందా? లేదా అనేది మాకు తెలియదు.

చిరుని చూసి..
‘వాల్మీకి’ సినిమాలో నా లుక్‌ కోసం చిరంజీవి డాడీ ‘పునాదిరాళ్లు’ సినిమాను ప్రేరణగా తీసుకున్నా (మీకు ఫొటో చూపిస్తా). దీన్ని ఆయన నాకు పంపారు. అప్పట్లో హీరో అంటే ఇలాంటి జుట్టుతోనే ఉంటారని నా అభిప్రాయం (నవ్వుతూ).

పాఠం నేర్చుకున్నా
‘అంతరిక్షం’ సినిమా నాకు పాఠం నేర్పింది. అలాంటి సినిమా రూ.10 కోట్లతో తీయలేం. పరిమితులు ఉండటం వల్ల అనుకున్నట్లు సినిమా తీయలేకపోయాం. షూటింగ్‌ సమయంలోనే మాకు అది అర్థమైంది. బడ్జెట్‌ ఉంటే ఈ సీన్‌ మరోలా చేసుండొచ్చు అని చాలా సార్లు అనుకున్నాం. అనుకున్నట్లే ప్రేక్షకులకు చిత్రం అంతగా నచ్చలేదు. ఇందులో నేను వేసుకున్న సూట్‌ ఇప్పటికీ నా ఆఫీసు ముందు ఉంచుకున్నా. దాన్ని చూసిన ప్రతిసారి నాకు కొన్ని గుర్తొస్తుంటాయి. అవి మీకు చెప్పలేను.

తను మంచి అమ్మాయి
‘వాల్మీకి’ ఓ మంచి ఎంటర్‌టైనర్‌. కొన్ని సార్లు.. సీన్లు చేస్తున్నప్పుడు షూటింగ్‌లో చాలా నవ్వుకుంటాం. కానీ థియేటర్‌లో ఆ సీన్‌ చూసిన ప్రేక్షకులు నవ్వరు. కానీ ఈ చిత్రం విషయంలో మేం నమ్మకంగా ఉన్నాం. ఇది అందర్నీ నవ్విస్తుంది. పూజాతో కలిసి నాలుగేళ్ల  క్రితం ‘ముకుంద’ కోసం పనిచేశా. ఇప్పుడు మళ్లీ ‘వాల్మీకి’లో జంటగా నటించాం. ఆమె చాలా మంచి అమ్మాయి. నటన పరంగా చాలా అభివృద్ధి చెందింది. ఈ సినిమాలో తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆమెతో కూడిన సీన్లు బాగుంటాయి.

చరణ్‌ కాదంటే చేస్తా

అనంతరం ‘చిరంజీవి బయోపిక్ తీస్తామని మీ వద్దకు ఎవరైనా వచ్చారా?’ అని ప్రశ్నించగా.. ‘తీస్తానని హరీష్‌ నాతో చెప్పారు. నాతో తీస్తారా? అని అడిగా. ‘నువ్వు కాదు..’ అన్నారు. బయోపిక్‌ తీస్తే నేనే తీస్తా అని ఆయన చెప్పారు’ అని వరుణ్‌ అన్నారు. ‘మీకు ఆఫర్‌ వస్తే చేస్తారా? లేక రామ్‌ చరణ్‌ చేస్తేనే బాగుంటుంది అంటారా?’ అని అడగగా.. ‘చరణ్‌ చేస్తేనే బాగుంటుంది. అతడు చేయకపోతే నేను చేస్తా (నవ్వుతూ). సీజీలో నా పొడవు తగ్గించుకుంటా (మళ్లీ నవ్వుతూ)’ అని చెప్పారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.