close

తాజావార్తలు

అమ్మాయి కాదు.. అందాల ‘RDX’ బాంబ్‌!

సాధారణంగా హీరోయిన్లు నెగిటివ్‌ రోల్స్‌ చేయడానికి ఇష్టపడరు. కెరీర్‌లో ఉన్నతస్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడో ఓసారి అదీ చాలా కొద్ది మంది మాత్రమే ప్రయోగాలకు ముందుకొస్తారు. కానీ, పాయల్‌ రాజ్‌పుత్‌ అలా కాదు. తెలుగులో నటించిన తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ప్రతినాయక ఛాయలున్న పాత్రను చేసి అటు అందంతోనూ, ఇటు అభినయంతోనూ అలరించింది. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వరుస అవకాశాలు దక్కించుకుంటున్న ఈ పంజాబీ భామ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. 

‘‘మా తల్లిదండ్రులది పంజాబ్‌లో అమృతసర్‌. అయితే, నేను పుట్టి పెరిగింది అంతా దిల్లీలోనే’’


‘‘చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఏర్పడటంతో ఆ దిశగా వచ్చేశా. తొలుత ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు. దీంతో నాకు ఏడాది సమయం ఇవ్వాలని కోరా. దీంతో వాళ్లు కూడా ఒప్పుకొన్నారు’’


‘‘అఖిర్‌ బాహు బి తో బేటి హీ హై’, ‘గుస్తాక్‌ దిల్‌’, ‘మహాకుంభ్: ఏక్‌ రహస్య’ ‘ఏక్‌ కహానీ’ వంటి టెలివిజన్‌ కార్యక్రమాలు నాకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక నా తొలి పంజాబీ చిత్రం ‘చానా మెరియా’. మరాఠీలో విజయవంతమైన ‘సైరాట్‌’కు రీమేక్‌ ఇది. పంకజ్‌ భత్రా దర్శకత్వం వహించారు’’


‘‘ఆ తర్వాత నేను ముంబయి వచ్చేశా. అదే సమయంలో ‘వీర్‌ దే వెడ్డింగ్‌’లో అవకాశం వచ్చింది. హిందీలో నా తొలి చిత్రమిదే’’


‘‘వీర్‌ దే వెడ్డింగ్‌’ చేస్తుండగానే ‘ఆర్‌ఎక్స్‌ 100’ కోసం దర్శకుడు అజయ్‌ భూపతి నన్ను సంప్రదించారు. కథ వినగానే వెంటనే ఒకే చెప్పేశా. ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేయడం నిజంగా థ్రిల్లింగ్‌గా అనిపించింది’’


‘‘ప్రస్తుతం శంకర్‌ భాను దర్శకత్వంలో నేను నటించిన ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ అక్టోబరు 11న విడుదలకానుంది. మహిళలు ఎదుర్కొన్నే ఇబ్బందులు, అసురక్షిత శృంగారం తదితర సమస్యలపై ఈ సినిమాలో చర్చించాం. ఇందులో అలివేలు అనే పాత్ర పోషిస్తున్నా. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రానికి ఈ చిత్రానికీ సంబంధం లేదు. ఇది కొనసాగింపు కాదు. ఈ సినిమాలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించా. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా’’


‘‘వెంకటేశ్‌ సర్‌తో ‘వెంకీమామ’.. రవితేజతో ‘డిస్కోరాజా’ చిత్రాల్లో నటిస్తున్నా. వెంకటేశ్‌ గారితో నటించడం నిజంగా నా అదృష్టం. సెట్‌లో చాలా మర్యాదగా ఉంటారు’’


‘‘ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో కసరత్తులు చేయడంతో పాటు, ఎక్కువగా యోగాకు ప్రాధాన్యం ఇస్తా. పవర్‌యోగాను చేస్తాను’’


‘‘ఉదయాన్నే గ్రీన్‌ టీ లేదా లెమన్‌ వాటర్‌తో రోజును ప్రారంభిస్తా. దాని ద్వారా శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్‌లు అందుతాయి’’


‘‘ఇక నా హాబీల విషయానికొస్తే వంట చేయడమంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో ఫుడ్‌కు సంబంధించిన వ్యాపారంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నా’’


‘‘నాకు చికెన్‌ అంటే చాలా ఇష్టం. అయితే, నాలుగేళ్ల కిందట నుంచి పూర్తిగా శాకాహారిగా మారిపోయా. రాజ్మా చావ్లా అంటే చాలా ఇష్టం. అదే విధంగా ఇంట్లో చేసిన ఏ ఆహారమైనా బాగా ఇష్టపడతా. ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నా’’



 

‘‘స్వతహాగా నేను జంతు ప్రేమికురాలిని. ప్రస్తుతం నా దగ్గర ఒక కుక్క ఉంది. దాన్ని ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నా’’


 

‘‘స్క్రిప్ట్‌ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే. కొత్త దర్శకులతోనైనా పనిచేస్తా’’


‘‘హిందీలో రాజ్‌కుమార్‌ రావు అంటే బాగా ఇష్టం. హీరోయిన్లలో కరీనాకపూర్‌ని బాగా ఇష్టపడతా’’


‘‘తెలుగులో ప్రభాస్‌, విజయ్‌దేవరకొండ అంటే బాగా ఇష్టం. ప్రభాస్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలన్నది నా కల’’

- ఇంటర్నెట్‌డెస్క్‌

 

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.