
తాజావార్తలు
హైదరాబాద్: ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ‘ఆర్ఆర్ఆర్’లో ఆయనకు జోడీగా ఎవరు నటిస్తారన్న సందేహాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. ఎన్టీఆర్-రామ్‌చరణ్ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
‘‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటివరకూ సాగిన ఊహాగానాలకు తెరపడే సమయం వచ్చేసింది. తారక్‌కు జోడీగా ఎవరు నటిస్తారనే విషయాన్ని రేపు(నవంబరు 20న) వెల్లడిస్తాం. అంతేకాదు, ప్రతినాయకుల పాత్రల వివరాలు కూడా చెబుతాం’’ -ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం
ఈ చిత్రంలో రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీంగా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా అలియాభట్ నటిస్తుండగా, తారక్ సరసన హాలీవుడ్ నటి డైసీ ఎడ్గారీ జోన్స్‌ను తీసుకున్నారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆమె చిత్రం నుంచి తప్పుకొన్నారు. దీంతో అప్పటి నుంచి తారక్ సరసన ఎవరు నటిస్తారు? అన్న సందేహం అభిమానుల్లో మొదలైంది. ఈ సందర్భంగా అనేకమంది పేర్లు వినిపించాయి. వీటిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా వెలువడలేదు. ఈ నేపథ్యంలో బుధవారం(నవంబరు 20న) వివరాలు వెల్లడిస్తామని టీం ఆర్ఆర్ఆర్ తెలిపింది. దీంతో తారక్ సరసన ఎవరు నటిస్తారన్న దానిపై ఆసక్తి మరింత పెరిగింది.
ఇక సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ విషయాన్ని ఇటీవల రామ్‌చరణ్ స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.