కోడంబాక్కం, న్యూస్‌టుడే: లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రత్యేకతను చాటుకుంటోంది నయనతార. తన పుట్టినరోజు సందర్భంగా రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఆర్జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్’. ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తోంది. దీని గురించి ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. ‘‘ ‘నానుం రౌడీదాన్’ చిత్రంలో నయనతారతో నటించా. అప్పటి నుంచే ఆమె మంచి స్నేహితురాలు. ఈ సినిమా కోసం ఆమెను ఓ రోజు కలిసి దాదాపు అరగంటపాటు కథ వినిపించా. ఆమెకు నచ్చడంతో నటించేందుకు అంగీకరించారు. ఇది భక్తికథా చిత్రం. ఇటీవలి కాలంలో దెయ్యం చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల కాస్త భిన్నంగా ఉంటుందని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో ఓ సందేశం కూడా ఉంటుంది. ఈ చిత్రం కోసం నయనతార దీక్షలో ఉంటూ నటిస్తున్నారు. సినిమాను ఆరంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు అందరం శాకాహారమే తీసుకుంటున్నాం. కన్యాకుమారి జిల్లాలోని భవానీ అమ్మవారి మరో పేరే ‘మూకుత్తి అమ్మన్’. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని’’ పేర్కొన్నారు.