
తాజావార్తలు
ఫన్ రెయిన్లో తడిసేందుకు సిద్ధమా!
‘రాగల 24 గంటల్లో..’ సాధారణంగా ఈ పదాన్ని వాతావరణ విశేషాలను తెలియజెప్పేందుకు వాడుతుంటారు. అంటే వచ్చే 24గంటల్లో ఎప్పుడు ఏం జరగబోతోంది? పరిస్థితులు ఎలా మారతాయి? ఎలాంటి అప్రమత్తత పాటించాలి? ఇలా వాతావరణశాఖ వారు ప్రతి విషయాన్ని సవివరంగా వెల్లడిస్తారు. దీంతో ప్రజలు కూడా జాగ్రత్తతో ఉంటారు. అయితే, ‘రాగల 24 గంటల్లో..’ ఎంటర్టైన్మెంట్పరంగా చాలా ఆసక్తికర విషయాలు జరగనున్నాయి. ఇందుకోసం జాగ్రత్తలేమీ తీసుకోవాల్సిన అవసరంలేదండోయ్? ఇటు సినీ అభిమానులతో పాటు, అటు క్రికెట్ అభిమానులు సందడి జడివానలో తడిసేందుకు సిద్ధంగా ఉండాలి. ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి గంటా ఫన్ రెయిన్ ఎడతెరిపి లేకుండా కురవనుంది. మొబైల్ డేటాను త్వరగా ఖర్చు చేసేయొద్దు. అవసరమైతే అదనపు బూస్టర్స్ కొనేందుకు సిద్ధంగా ఉండండి. మొబైల్‌ను ఫుల్‌ఛార్జ్ చేయండి. వాట్సాప్ స్టేటస్, ప్రొఫైల్ పిక్‌లను, ఫేస్బుక్ స్టోరీస్లను ఖాళీగా ఉంచుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే... ఫన్ రెయిన్ ఎప్పుడు ఎలా కురుస్తుంది. చిరు జల్లులతో మొదలై ఎలా తుపానుగా మారుతుందో తెలుసుకుందాం.. పదండి..!
శుక్రవారం ఉదయం.. ‘జార్జిరెడ్డి’ జడివాన..
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘జార్జిరెడ్డి’. ఉస్మానియాలో విద్యార్థి నాయకుడైన ‘జార్జిరెడ్డి’ జీవిత కథ ఆధారంగా జీవన్‌రెడ్డి దీన్ని తెరకెక్కించారు. సందీప్ మాధవ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు చిత్ర పరిశ్రమలో చిరంజీవి నుంచి యువ కథానాయకుడు రామ్ అందరూ ఈ చిత్ర ట్రైలర్‌ను చూసి ఎంతో మెచ్చుకున్నారు. సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫిజిక్స్‌లో బంగారుపతకం సాధించిన జార్జిరెడ్డి.. 1970 ప్రాంతంలో ఉస్మానియాలో జరిగిన అన్యాయాలను, అణచివేతలపై చేసిన పోరాటాన్ని ఇందులో చూపించనుండటంతో యువతలోనూ ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ‘జార్జిరెడ్డి’ అంచనాలను అందుకుంటాడో లేదో తెలియాంటే ‘24గంటలు’ ఆగాల్సిందే!
క్రైమ్ థ్రిల్లర్ భారీ వర్షంగా మారి..
క్రైమ్, మిస్టరీ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అటువంటి చిత్రమే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సత్యదేవ్, ఈషారెబ్బ, శ్రీకాంత్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రాహుల్ (సత్యదేవ్), విద్య(ఈషా రెబ్బ)లు వివాహ బంధంతో ఒక్కటవుతారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో రాహుల్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆ మిస్టరీని ఏసీపీ నరసింహా ఎలా ఛేదించాడు? ఆ 24గంటల్లో ఏంజరిగింది? తెలియాంటే మరో 24గంటలు వేచి చూడాల్సిందే!
‘చలి, మంచు’తో కూడి...
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ స్టూడియోస్, మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఫ్రోజెన్ 2’. 2013లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘ఫ్రొజెన్’ చిత్రానికి కొనసాగింపుగా ఇది రాబోతోంది. తెలుగులో చిత్రానికి రాకుమార్తె ఎల్సా పాత్రకు నిత్యామేనన్ గొంతునిచ్చారు. అలాగే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తనయ సితార ఈ చిత్రంలో చిన్నప్పటి ఎల్సా పాత్రకు గాత్రాన్ని అందించారు. దీంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మధ్యాహ్నం ‘పింక్ బంతుల’ పిడుగులు పడతాయ్ జాగ్రత్త!
ఉదయం ఇష్టమైన సినిమాను చూసి ఫన్ రెయిన్లో తడుచుకుంటూ నేరుగా ఇంటికి వచ్చేయండి. టీవీ ఆన్ చేయగానే, కోల్‌కతాలో ‘పింక్ బంతుల’ పిడుగులు పడటం మీరు చూడొచ్చు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కోల్‌కతా వేదికగా శుక్రవారం తొలి డేనైట్ టెస్టును టీమిండియా ఆడనుంది. దీని కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం అలా భోజనం చేసి, గులాబీ బంతుల ఆటను ఆస్వాదిస్తూ కూర్చొంటే సాయంత్రం సందడి వాన మరింత పెరుగుతుంది. ఒకరికి ఇద్దరు హీరోలు గంటలో వ్యవవధిలో వస్తుంటే వాతావరణం మారిపోకుండా ఉంటుందా? వాళ్ల సందడి జడివానలో తడవడానికి సిద్ధమై పోవాల్సిందే!
బన్ని పాటలో తడిసి ‘OMG Daddy’ అనాల్సిందే!
‘సామజవరగమన..’, ‘రాములో రాముల..’ ఈ రెండు పాటలు ఇప్పుడు యువతను తెగ హుషారెక్కిస్తున్నాయి. రింగ్టోన్లు, కాలర్ ట్యూన్లలో ఈ పాటలలో మార్మోగుతున్నాయి. ఇప్పుడు మూడో పాట కూడా సిద్ధమైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. ఇందులోని ‘OMG Daddy...’ ఫుల్సాంగ్ వీడియోను శుక్రవారం సాయంత్రం 4.05గంటలకు చిత్ర బృందం అభిమానులతో పంచుకోనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సాంగ్ టీజర్లో బన్ని పిల్లలు అయాన్, అర్హలు సందడి చేశారు. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ పాటను రోల్ రైడా, రాహుల్ సిప్లిగంజ్, బ్లాజీ, రాహుల్ నంబియార్, రాబిట్ మ్యాక్‌లు ఆలపించారు. తమన్ స్వరాలు సమకూర్చారు.
‘మహేశ్’ తుపానుగా మారి...
అప్పటివరకూ భారీ వర్షంగా కురిసిన ఫన్ రెయిన్ సాయంత్రం 5గంటల తర్వాత ‘మహేశ్’ తుపానుగా మారనుంది. ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. ఇప్పటివరకూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్లు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం 5.04గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నారు. మరి ఈ టీజర్లో ఎలాంటి పంచ్ పిడుగులు పడతాయో చూడాలి. ఇక చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించే అనిల్ రావిపూడి.. మేజర్ అజయ్ కృష్ణతో ఎటువంటి సందడి చేయించాడో తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే.
మళ్లీ గులాబీ బంతుల వాన!
మధ్యాహ్నం మొదలైన గులాబీ బంతుల జడివాన సాయంత్రానికి మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ముఖ్యంగా సాయంత్రం 5.00-7.00 గంటల మధ్య గులాబి బంతి అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని.. అప్పుడు ఫాస్ట్‌బౌలర్లను తట్టుకోవడం బ్యాట్స్‌మెన్‌కు శక్తికి మించిన పనే అని విశ్లేషకులు అంటున్నారు. మ్యాచ్ ఆరంభంలో కొత్త బంతి ఇబ్బంది పెట్టినా.. అలవాటు పడితే నిలదొక్కుకోవచ్చని.. అయితే వెలుతురు తగ్గి పొద్దుపోయే సమయంలో, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మంచు ప్రభావం మొదలవుతున్న తరుణంలో గులాబి బంతిని ఎదుర్కోవడం సవాలే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏ బౌలర్.. ఏ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతాడో చూడాలి. అదండీ.. రాగల 24గంటల్లో ఎంటర్టైన్మెంట్ వాతావరణం పరిస్థితి!
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు