మున్నా గ్యాంగ్‌ పేరిట బాలుడి కిడ్నాప్‌ డ్రామా

తాజా వార్తలు

Updated : 18/11/2020 13:16 IST

మున్నా గ్యాంగ్‌ పేరిట బాలుడి కిడ్నాప్‌ డ్రామా

సత్తెనపల్లి : చరవాణి కొనుక్కుంటానని ఇంట్లో నుంచి సిమ్‌ తీసుకెళ్లిన 12 ఏళ్ల బాలుడు అదృశ్యమై 20 గంటల తర్వాత ప్రత్యక్షమైన సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంచలనం సృష్టించింది. ఇంతకీ బాలుడిని ఎవరైనా అపహరించారా.. ఆకతాయితనంతో కిడ్నాప్‌ నాటకాన్ని ఆడారా అనేది ఇంకా తేలలేదు. సీఐ ఎస్‌.విజయచంద్ర, బాలుడి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు..పట్టణంలోని నిర్మలానగర్‌కు చెందిన దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు. సుగాలీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కరోనాతో పాఠశాల లేకపోవడంతో తండ్రి నిర్వహించే వస్త్ర దుకాణంలో ఉంటున్నాడు. 

సోమవారం రాత్రి దుకాణం నుంచి వినయ్‌ ఇంటికి వెళ్లి తాత చరవాణి సిమ్‌ తీసుకున్నాడు. రాత్రి 10 గంటలకు తండ్రికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేశాం.. మేం గుంటూరు హైవేలో ఉన్నామని అవతలి వ్యక్తి చెబితే తండ్రి తమాషా చేస్తున్నారని భావించాడు. నా పేరు మున్నా.. మా గ్యాంగ్‌ 150కి పైగా హత్యలు చేసింది.. మేమంటే అందరికి టెర్రర్‌.. నీ కుమారుడు క్షేమంగా ఇంటికి రావాలంటే డబ్బులు సిద్ధం చేసుకో తర్వాత అన్ని విషయాలు చెబుతాం అనే సరికి ఆయన కలవరపడ్డారు. వెంటనే పోలీసు స్టేషన్‌కు చేరుకుని సీఐ విజయచంద్రకు కాల్‌ రికార్డు వినిపించారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మళ్లీ ఫోన్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాతీస్తే పట్టణంలోని పాత సూర్యాటాకీస్‌ వద్ద ఉన్న టవర్‌గా తేలింది. ఆ ప్రాంతంలో అర్ధరాత్రి జల్లెడ పట్టినా ఫలితం లేకపోయింది. మంగళవారం ఉదయం తండ్రికి మళ్లీ ఫోన్‌ వచ్చింది. రూ.10 లక్షలు నగదు ఇస్తే వినయ్‌ను సురక్షితంగా పంపిస్తామని డబ్బులివ్వకుంటే సినిమాల్లో తరహాలో శరీర అవయవాలు దఫాలుగా పంపిస్తామని హెచ్చరించారు. చెప్పిన నగదు ఇచ్చేందుకు చిన్నారి తండ్రి ఇష్టత చూపించక పోవడంతో ఈసారి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ నగదుకు కూడా స్పందన రాకపోవడంతో రూ.10 వేలు నగదును నరసరావుపేట రోడ్డులోని ఎస్సీ బాలికల వసతిగృహం సమీపంలో నిలుపుదల చేసిన కారు కింద పెట్టి వెళ్లిపోవాలని కిడ్నాపర్లు సూచించారు. పోలీసుల సూచనతో బాలుడి తండ్రి రూ.10 వేలు నగదును కారు కింద పెట్టారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకొని ప్రతిఒక్కరిపై నిఘా పెట్టారు. చివరకు సాయంత్రం 6 గంటల సమయంలో కారు వద్దకు వెంకటేశ్వర్లు వచ్చి నగదు తీసుకోబోతుండటంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. తన కుమారుడు ఇక్కడి సమీపంలోని వేబ్రిడ్జి పక్కనే ఉన్న ముళ్లపొదల వద్ద పశువుల కాపరి ఫోన్‌ నుంచి కాల్‌చేస్తే వెళ్లి క్షేమంగా తీసుకొచ్చానని ఆయన చెప్పడంతో ఇద్దరిని స్టేషన్‌కు తరలిచారు. డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, సీఐలు చిన్నారిని ఏం జరిగిందని విచారించగా స్నేహితుడితో కలిసి తాను నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తుంటే కారులో వచ్చిన ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు స్నేహితుడిని కొట్టి తనను కిడ్నాప్‌ చేశారని చెప్పాడు. తెల్లారేసరికి ముగ్గురు కిడ్నాపర్లుకాస్తా ఐదుగురు అయ్యారని వారు తనను వేధించి తండ్రికి ఫోన్‌ చేయించి డబ్బులు డిమాండ్‌ చేశారని తెలిపాడు. ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో నరసరావుపేట రోడ్డులోని వేబ్రిడ్జి వద్ద వదిలివెళితే తండ్రికి ఫోన్‌ చేసినట్లు చెప్పాడు. అబ్బాయి స్నేహితుడిని పోలీసు అధికారులు విచారించగా సోమవారం రాత్రి తాను ఊర్లోనే లేనని చెప్పాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

కిడ్నాప్‌ నాటకం బయటపడిందిలా...

ఇంటి నుంచి తీసుకెళ్లిన సిమ్‌ కార్డుతోనే బెదిరింపు కాల్స్‌ రావడంతో అనుమానం వచ్చి పోలీసులు బాలుడిని గట్టిగా నిలదీశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. దుకాణంలో పనిచేసే 17 ఏళ్ల గుమాస్తాతో కలిసి బాలుడు కిడ్నాప్‌ నాటకం ఆడినట్టు వెల్లడైంది. గుమాస్తా ఇంట్లోనే వారి తల్లిదండ్రులకు తెలియకుండా బాలుడు దాక్కున్నాడు. సెల్‌ఫోన్‌ ఎక్కవగా చూస్తున్నాడని మందలించడంతో తండ్రిపై కోపం పెంచుకున్న బాలుడు అతన్ని బెదిరించాలనే ఉద్దేశంతో కిడ్నాప్‌ నాటకం ఆడినట్లు తేలింది. కిడ్నాప్‌ నాటకం, తల్లదండ్రులు, తమను తప్పుదోవ పట్టించడంపై చర్యలకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.  పిల్లల నడవడిక, పరిచయాలపై దృష్టిసారించాలని, మొబైల్‌ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని