close

తాజా వార్తలు

Updated : 29/11/2020 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాక్సిన్‌ వికటించింది.. రూ. 5 కోట్లివ్వండి

సీరంకు  కొవిడ్‌ టీకా వాలంటీరు నోటీసులు

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వాలంటీరు.. భారీ నష్టపరిహారం కోరుతున్నారు. తనపై ప్రయోగించిన టీకా డోసుల కారణంగా పలు నాడీ సంబంధ సమస్యలు తలెత్తాయని.. ఇందుకు గాను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్ఐఐ) తనకు రూ. 5 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపారు. చెన్నైకి చెందిన ఈ 40 ఏళ్ల  వ్యాపార సలహాదారు (బిజినెస్‌ కన్సల్టెంట్‌)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌, ఐసీఎంఆర్‌, అస్ట్రాజెనికా, డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆప్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరుగుతున్న జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ల్యాబొరేటరీస్‌ తదితరులకు లీగల్‌ నోటీసు పంపామని బాధితుడి తరపు న్యాయవాది వెల్లడించారు. నవంబర్‌ 21న పంపిన నోటీసుకు ఇప్పటి వరకు వారు స్పందించలేదన్నారు.

ఏం జరిగిందంటే..

తమ కొవిడ్‌-19 టీకా మూడో దశ ప్రయోగాల్లో పాల్గొనేందుకు వలెంటీర్లు కావాలంటూ.. రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన ప్రకటన మేరకు తాను దరఖాస్తు చేసుకున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. ఐతే తమకు ఇచ్చిన సమాచార పత్రంలో ఈ విధమైన తీవ్ర ప్రతికూల ప్రభావాలు సంభవించగలవని హెచ్చరించలేదన్నారు. అక్టోబర్‌ 1న  తనకు ఈ వ్యాక్సిన్‌ డోసు ఇచ్చారని.. తొలి పదిరోజులు ఏ సమస్య తలెత్తలేదన్నారు. అనంతరం అక్టోబర్‌ 11న భరించలేని తలనొప్పి, వాంతులు, తల తిరగడం తదితర సమస్యలతో తనకు పైకి లేవటమే కష్టమైందన్నారు. 16 రోజుల చికిత్స్ అనంతరం తాను అక్టోబర్‌ 26న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు తెలిపారు. తాను అనుభవించిన యాతన, భవిష్యత్తులో తలెత్తగల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తనకు రూ.5 కోట్ల పరిహారాన్ని మంజూరు చేయాలని చెన్నైకి చెందిన బాధితుడు కోరుతున్నారు. అంతేకాకుండా సదరు టీకా తయారీ, పంపిణీ, ప్రయోగాలను కూడా ఆపివేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన