3 రోజులుగా వేలాడిన మృతదేహం

తాజా వార్తలు

Updated : 09/12/2020 04:24 IST

3 రోజులుగా వేలాడిన మృతదేహం

సిరికొండ: నిజామాబాద్ జిల్లాలో ఇంటి వెనక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు కిందకు దించారు. ఈ సంఘటన జిల్లాలోని సిరికొండ మండల పరిధిలోని న్యావనందిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌ 3న గ్రామానికి చెందిన మహిళా రైతు పుర్రె మమత అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను విచారించడం మొదలుపెట్టారు. వారిలో ఒక్కడిగా భావిస్తున్న అదే గ్రామానికి చెందిన తర్ర గంగాధర్‌(43)ను సైతం పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా అనుమానితులకు నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈలోగా నిందితుల్లో ఒకడైన తర్ర గంగాధర్‌ తన ఇంటి వెనక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

విచారణ సమయంలో గంగాధర్‌ ఆత్మహత్య చేసుకోవడం వివాదానికి దారి తీసింది. మహిళను హత్య చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు బలవంతం చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి మృతదేహాన్ని చెట్టు నుంచి తీయకుండా కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. సోమవారం ఆర్డీవో రవి గ్రామానికి చేరుకొని గంగాధర్‌ కుటుంబసభ్యులు, గ్రామస్థులతో చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదు. జిల్లా కలెక్టర్‌ వచ్చి న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని కిందకు దించేందుకు ఒప్పుకోమని మృతుని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్డీవోను ఘటనా స్థలంలోనే నిర్బంధించారు.

మహిళా రైతు మమత హత్యకేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఉష విశ్వనాథ్ మంగళవారం మృతుని కుటుంబసభ్యులు, బంధువులతో మాట్లాడారు. మృతదేహాన్ని కిందకి దించాలని, కలెక్టర్‌, సీపీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని, గ్రామస్థుల ముందే విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. అనంతరం సిరికొండ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్థులు ధర్నాకు దిగారు. ఉష విశ్వనాథ్‌కు వినతి పత్రం అందించిన తర్వాత సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో గంగాధర్‌ను వేధించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మృతుని కుటుంబసభ్యులు ఆందోళన విరమించి మృతదేహాన్ని కిందకు దించేందుకు ఒప్పుకోవడంతో వెంటనే మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని