
తాజా వార్తలు
అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడి దారుణహత్య
అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోట శ్రీహరి(65) అనే వైద్యుడు అవనిగడ్డ పట్టణంలో తన ఇంటి వెనుకభాగంలో లక్ష్మీ నర్సింగ్‌హోమ్ నిర్వహిస్తూ భార్యతో కలిసి నివసిస్తున్నారు. మిగతా కుటుంబసభ్యులు ఖమ్మం, హైదరాబాద్‌లో ఉంటున్నారు. శుక్రవారం శ్రీహరి భార్య బంధువుల ఇంటికి వెళ్లింది. శనివారం ఉదయం తొమ్మిది గంటలు దాటినా వైద్యుడు శ్రీహరి ఆస్పత్రికి రాకపోవటంతో అక్కడ పనిచేసే నర్సు.. వైద్యుడి ఇంటికి వెళ్లి చూసేసరికి శ్రీహరి అతని గదిలోనే రక్తపు మడుగులో ఉన్నారు. దీంతో నర్సు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు.
మృతుని ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు పగలగొట్టి ఉండటం, ఇంట్లో బీరువా తెరిచి చిందరవందరగా ఉండటాన్ని పోలీసులు గమనించి పరిశీలించారు. మృతదేహం తల, శరీరంపై గాయాలున్నాయి. డబ్బుకోసమే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు, జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశం ఎమ్మెల్యే కార్యాలయానికి వంద మీటర్లు, డీఎస్పీ కార్యాలయానికి 50 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం.