పెళ్లికి ముందు ఫొటోషూట్‌.. విషాదాంతం

తాజా వార్తలు

Updated : 13/11/2020 05:23 IST

పెళ్లికి ముందు ఫొటోషూట్‌.. విషాదాంతం

టైటానిక్‌లా చేయబోయి కాబోయే దంపతుల మృతి

మైసూరు: కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఓ జంట.. నీటిలో మునిగి మృత్యువు పాలైన విషాద సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రముఖ ఇంగ్లీషు చిత్రం టైటానిక్‌ లాగా ఫోటో తీయించుకోవాలన్న వీరి సరదా ప్రాణాలను బలిగొంది. యువతి ధరించిన ఎత్తుమడమల చెప్పులే (హైహీల్స్‌) వీరి మరణానికి కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు.

మైసూరు జిల్లా, యఖ్యాతమరానహళ్లికి చెందిన చంద్రు (28), శశికళ (20) దూరపు బంధువులు. వీరికి గత సంవత్సరం నవంబరు 22న వీరి నిశ్చితార్థం జరుగగా.. ఈ ఏడాది నవంబర్‌ 22న వివాహం జరగాల్సి ఉంది. ఈ లోగా వీరు వివాహానికి ముందు జరిపే ‘ప్రి వెడ్డింగ్‌ ఫోటోషూట్‌’ కోసం టీ నరసిపూర తాలూకా, ముడుకుథూరుకు వెళ్లారు. కావేరీ నదిలో పుట్టి (చిన్న పడవ)లో ప్రయాణం ఇక్కడ పర్యాటక ఆకర్షణ. తమకు టైటానిక్‌ చిత్రంలో మాదిరిగా ఫోటో తీయాల్సిందిగా ఈ జంట కోరారు. ఇందుకుగాను ఒడ్డు నుంచి 20 మీటర్ల దూరంలో ఓ పుట్టిలో వీరు నిలబడి ఉండగా.. ఫోటోగ్రఫర్‌, యువతి సోదరుడు ఒడ్డున ఉన్నారు. ఈ క్రమంలో హైహీల్స్‌ ధరించిన శశికళ పట్టుతప్పి ఒక వైపు ఒరిగి పోయింది. దీనితో పుట్టి అదుపుతప్పి బోల్తాపడింది. దానిని నడుపుతున్న మూగప్పతో సహా ముగ్గురూ నీటిలో పడిపోయారు. నడిపే వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. చంద్రు, శశికళ  ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు.

సమాచారమందిన తాలక్కాడ్‌ పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించి మృతదేహాలను వెలికి తీయించారు. అంతకు ముందు తాలక్కాడ్‌ దేవాలయం వద్ద ఫోటో షూట్‌ జరుపుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవటంతో వారు ఇక్కడికి వెళ్లాల్సి వచ్చిందని మృతుల బంధువులు విచారం వ్యక్తం చేశారు. పుట్టిలో ప్రయాణం అస్థిరంగా సాగుతుందని.. కాస్త అదుపు తప్పినా పెనుప్రమాదం సంభవింస్తుందని పోలీసులు వివరించారు. ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా లైఫ్‌ జాకెట్లను ధరించడం తప్పనిసరి చేయాల్సిందిగా నీటి పారుదల శాఖకు లేఖ రాస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని