
తాజా వార్తలు
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
మరొకరికి గాయాలు
భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్‌గిరిలో గురువారం భద్రతా సిబ్బందికి, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జంత్రి అడవిలోని స్వాభిమాన్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించగా, మరొకరు గాయపడ్డారు. మల్కన్‌గిరి ఎస్పీ రిషికేశ్ కిలారి తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు భద్రతా దళ సిబ్బందిపై కాల్పులు జరిపారు. భద్రతాదళ సిబ్బంది ప్రతిఘటించడంతో వారు వెనుదిరిగారు. కాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించగా, మరొకరు గాయపడ్డారు. మరణించిన మావోయిస్టును కిషోర్‌గా గుర్తించారు. ఈ ఘటనతో పోలీసులు మావోలను ఏరివేసేందుకు కూంబింగ్‌ను తీవ్రం చేశారు. మరణించిన మావోయిస్టు వద్ద నుంచి ఏకే47ను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ అభయ్ తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనలో భద్రతాదళ సిబ్బందికి ఏ గాయాలు కాలేదని వెల్లడించారు.