ప్రేమజంట..కాసేపట్లో పెళ్లి..అంతలోనే విషాదం!

తాజా వార్తలు

Published : 13/10/2020 02:00 IST

ప్రేమజంట..కాసేపట్లో పెళ్లి..అంతలోనే విషాదం!

చౌటుప్పల్‌: ఏడడుగులు నడిచి నూరేళ్ల జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కంటూ బయలుదేరిన ఓ ప్రేమ జంటను రోడ్డు ప్రమాదం విడదీసింది. యువ జంట ఆశలను ఆవిరిచేసి విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌ హయత్‌నగర్‌కు చెందిన నాగరాజు, శ్రీలత గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆశలతో ద్విచక్రవాహనంపై నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు దేవాలయానికి బయలుదేరారు. కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనగా.. కారు రూపంలో మృత్యువు కబలించింది. చౌటుప్పల్‌ జాతీయ రహదారి సిగ్నల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. కొన్ని క్షణాల్లో గ్రీన్‌ సిగ్నల్‌ పడేందుకు సమయం సమీపిస్తుండటంతో యువజంట ఉన్న ద్విచక్రవాహనంతోపాటు ముందున్న లారీ, కార్లు నెమ్మదిగా ముందుకు కదిలాయి. అంతలోనే హైదరాబాద్‌ నుంచి విజయవాడవైపు వెళ్తున్న కారు అతివేగంతో దూసుకొచ్చి ముందున్న వాహనాలను బలంగా ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో నాగరాజు, శ్రీలత ఉన్న ద్విచక్ర వాహనానికి మంటలు అంటుకున్నాయి. పెట్రోల్‌ లీకై మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన నాగరాజును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. గాయపడిన యువతి శ్రీలతతో పాటు మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తుండగా.. సీసీటీవీ దృశ్యాలు చూస్తే మాత్రం కారు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఘటనకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతివేగంగా ఢీ కొట్టిన తర్వాత కారు వేగం కొంచెం నెమ్మదించినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని