కోచ్‌గా తీసేశారని... అలా చేసాడు!

తాజా వార్తలు

Published : 21/08/2020 02:29 IST

కోచ్‌గా తీసేశారని... అలా చేసాడు!

ప్రతీకారానికి పాల్పడిన మాజీ కోచ్‌

దిల్లీ: కోచ్‌గా ఆటలో శిక్షణ ఇచ్చిన వ్యక్తే, ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను తస్కరించిన సంఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. బాధ్యతల నుంచి తప్పించినందుకు ప్రతీకారంగా ఈ పనికి పూనుకున్న శేఖర్‌ పథక్‌ అనే మాజీ ఫుట్‌బాల్‌ కోచ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తనను విధుల నుంచి తీసివేసి, కొత్త కోచ్‌ను నియమించారన్న అక్కసుతో అతను ఈ విధంగా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి..

శేఖర్‌ పథక్‌ను 2011లో దిల్లీలోని జవహర్‌లాల్‌ స్టేడియంలో ఫుట్‌బాల్‌ కోచ్‌గా నియమించారు. అయితే విధుల పట్ల అశ్రద్ధ వహించటంతో అతనిని 2013లో సస్పెండ్‌ చేశారు. అనంతరం స్వంత కోచింగ్‌ సెంటర్‌ను కొన్నాళ్లు నడిపినా, అది అంతగా విజయవంతం కాకపోవడంతో మూతపడింది. శేఖర్‌ ఆ తర్వాత ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేశాడు. కాగా, మార్చి 13న జవహర్‌లాల్‌ స్టేడియంలో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో పాల్గొన్న దిల్లీ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాళ్లు ఫోన్లు, ఇతర వస్తువులను డ్రెస్సింగ్‌ రూంలోని క్యాబిన్లలో పెట్టుకున్నారు. మ్యాచ్‌ అనంతరం తిరిగివచ్చి చూడగా.. తమ ఫోన్లు, డబ్బు మాయమైనట్టు గుర్తించారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అనంతరం కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ ఫోన్లను ఎవరు వాడుతున్నారు అనే అంశంపై నిఘా పెట్టారు. ఓ వ్యక్తి వాటిని వాడుతున్నాడని కనిపెట్టి, ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం మాజీ కోచ్‌ ఇంట్లో సోదా నిర్వహించగా, ఆటగాళ్లకు చెందిన తొమ్మిది ఫోన్లు దొరికినట్లు పోలీసులు తెలిపారు. మంచి ఆటగాడు, కోచ్‌నైన తనను విధుల నుంచి తప్పించినందుకు అసహనానికి గురై ఇలా చేసినట్టు శేఖర్‌ పథక్‌ విచారణ సందర్భంగా అంగీకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని