close

తాజా వార్తలు

Updated : 06/12/2020 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏలూరులో 100 మందికి అస్వస్థత

ఏలూరు వన్‌టౌన్‌‌: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్‌, టూటౌన్‌ పరిధిలో స్థానికులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పడమర వీధి, దక్షిణ వీధి, కొత్తపేట, వంగాయగూడెం ప్రాంతాల్లో 100 మంది  కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అస్వస్థతకు గురైన వారిలో 22మంది చిన్నారులు కూడా ఉన్నారు.  విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఒక్కసారిగా పెద్దసంఖ్యలో అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో అస్వస్థతకు గురైన వారి రక్తనమూనాలు సేకరించి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం పంపించినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే నీరు కలుషితం కావడం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

కలెక్టర్‌ అత్యవసర సమావేశం

ప్రస్తుతం బాధితుల సంఖ్య 100కు చేరుకోవడంతో కలెక్టర్‌ రేగు ముత్యాలరాజు అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 100 పడకలు, ఆశ్రమ ఆస్పత్రిలో 50 పడకలు సిద్ధం చేశారు. అత్యవసరమైతే విజయవాడకు బాధితులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

బాధితులకు మంత్రి నాని పరామర్శ..

పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఒకేసారి ఇంత మంది అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలియరాలేదని.. వైద్య బృందం ఆ పనిమీదే ఉందని చెప్పారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఓ బాలికను మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించామన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాల్లో వైద్యుల బృందం ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆళ్ల నాని వివరించారు.

 

భయాందోళనలో స్థానికులు..

కారణం ఏంటో తెలియకుండా పెద్ద ఎత్తున ప్రజలు అస్వస్థతకు గురికావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నీటి కాలుష్యం కారణంగా అలా జరుగుతుందనే అనుమానంతో ముందస్తు చర్యలో భాగంగా ఇంట్లో నీరు తాగకూడదంటూ వైద్య సిబ్బంది, వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న శుద్ధ జలం (ఫ్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌) ప్లాంట్‌ వద్ద నీటి కోసం ప్రజలు బారులు తీరారు. అస్వస్థతకు గల కారణాలను సాధ్యమైనంత త్వరగా తెలుసుకోవాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. 

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన