మరో దారుణం..!

తాజా వార్తలు

Updated : 30/09/2020 17:21 IST

మరో దారుణం..!

అత్యాచార బాధితురాలి మృతదేహానికి అర్ధరాత్రి అంత్యక్రియలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సామూహిక అత్యాచారానికి గురై.. తీవ్ర గాయాలతో పదిరోజులకు పైగా మృత్యువుతో పోరాడి ఓడిపోయిన యువతికి న్యాయం చేసే విషయంలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది. ఆమె మృతదేహాన్ని దిల్లీలోని ఆసుపత్రి నుంచి నేరుగా హాథ్రాస్‌కు తరలించి అక్కడే అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు మృతురాలి రక్తసంబంధీకులను కూడా అనుమతించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎప్పటిలానే పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. 

హడావుడిగా అంత్యక్రియలు..

పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే దిల్లీలోని ఆసుపత్రి నుంచి స్వాధీనం చేసుకొన్నారని ఆమె సోదరుడు ఆరోపించారు. బంధువులు, సన్నిహితుల కథనం ప్రకారం.. దిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్న  ఆమె సోదరుడు, తండ్రిని యూపీ పోలీస్‌ ప్లేట్‌ ఉన్న నల్లటి స్కార్పియో వాహనంలో ఎక్కించి తరలించారు. అక్కడి నుంచి  200  కిలోమీటర్ల దూరంలోని హాథ్రాస్‌కు తీసుకొచ్చారు. అక్కడ మృతదేహాన్ని అప్పగిస్తే ఇంటికి తీసుకెళ్లి ఉదయం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు కోరగా.. పోలీసులు ఇందుకు నిరాకరించినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతురాలి తల్లిని బలవంతంగా పక్కకు తప్పించి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. ఈ క్రమంలో చాలా చోట్ల ఆందోళనకారులను పోలీసులు పక్కకు నెట్టేశారు.

ఈ సమయంలో తమను ఇళ్లలోనే బంధించినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.  మృతదేహాన్ని కడసారి చూసేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని బాధితురాలి తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. అర్ధరాత్రి అంత్యక్రియలు చేయడం తమ ఆచారానికి విరుద్ధమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌ కుమార్‌ లక్స్‌కర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆమె బంధువులు పేర్కొన్నారు. 

కుటుంబ సభ్యులు ఉన్నారు.. : జిల్లా మేజిస్ట్రేట్‌

బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో కుటుంబ సభ్యులను నిర్బంధించారనే ఆరోపణలను జిల్లా మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఖండించారు. ‘‘అంత్యక్రియల సమయంలో ఆమె కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నట్లు మా వద్ద వీడియోలు ఉన్నాయి. వాటిని మీడియాకు ఇస్తాము. కుటుంబం వద్ద అనుమతి తీసుకొనే అంత్యక్రియలు జరిపాము. మీడియా కథనాలు అవాస్తవం’’ అని పేర్కొన్నారు.

వారంలో కేసుపై నివేదిక: యూపీ సీఎం

‘‘హాథ్రాస్‌ ఘటనపై ప్రధాని మోదీ మాట్లాడారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనలో హంతకులు శిక్ష నుంచి తప్పించుకోలేరు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఆ బృందం వారం రోజుల్లో నివేదిక సమర్పించనుంది. బాధితురాలికి త్వరితగతిన న్యాయం జరిగేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కేసు విచారణ జరుగుతుంది’’  అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ట్విటర్‌లో తెలిపారు.

సందేహాస్పదంగా పోలీసుల వైఖరి: మాయావతి

ఈ ఘటన సందేహాస్పదంగా ఉందని బీఎస్పీ అధినేత మాయావతి విమర్శించారు. ‘‘హాథ్రాస్‌లో అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా అర్ధరాత్రి పోలీసులే అంత్యక్రియలు చేయడం అనుమానాస్పదంగా ఉంది. పోలీసుల తప్పుడు వైఖరిని బీఎస్పీ ఖండిస్తోంది. సుప్రీం కోర్టు నేరుగా జోక్యం చేసుకోవాలి. లేకపోతే బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందనిపించడంలేదు’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

హాథ్రాస్‌లో ఈ నెల 19న తల్లితో కలిసి పొలానికి వెళ్లిన యువతి అక్కడి నుంచి అదృశ్యమయింది. పశువుల మేత కోసం కాస్త దూరానికి వెళ్లిన ఆమెను నలుగురు నిందితులు లాక్కొనిపోయి దారుణానికి ఒడిగట్టారని ఆ తర్వాత బయటపడింది. అత్యాచారాన్ని ప్రతిఘటించాలని చూసిన ఆమెను చున్నీతో గొంతు నులిమి చంపేందుకు ముష్కరులు ప్రయత్నించినప్పుడు నాలుక తెగిపోయిందని ఫిర్యాదు నమోదైంది. ఈ ఘోర ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతిని తొలుత అలీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నాలుక తెగిపోయి, వెన్నెముకకు గాయాలతో, చేతులు పాక్షికంగా, కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయిన ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం సోమవారం దిల్లీకి తరలించారు. 
సామూహిక అత్యాచారానికి గురై, మృత్యువుతో పోరాడిన ఆ దళిత యువతి (19) మంగళవారం తెల్లవారుజామున దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో కన్నుమూసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని