close

తాజా వార్తలు

ఇల్లరికం ఇష్టం లేక భార్య, కుమారుడి హత్య

నగర శివారులో ఓ వ్యక్తి నిర్వాకం
ఆనక ఆత్మహత్యకు యత్నం..

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఇల్లరికం ఇష్టం లేకపోవడం, అత్తింటివారిపై కోపంతో భార్య, కుమారుడిని హత్య చేశాడో వ్యక్తి. తానూ ఆత్మహత్యకు యత్నించాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. కర్ణాటక యాదిగిర్‌ జిల్లా తాలూకా రాంపూర్‌ గ్రామానికి చెందిన, ఆటో ట్రాలీ డ్రైవరుగా పనిచేసే అనంతప్ప(26) అలియాస్‌ చిన్నకు అదే జిల్లా ఒణిగిరికి చెందిన అతడి మేనత్త కూతురు మహాదేవి(22)తో తొమ్మిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. తల్లిదండ్రులు అతడిని ఇల్లరికం పంపారు. ఏడాది కిందట అతడు ఉపాధి కోసం భార్య, కుమారుడు ఆకాశ్‌(18నెలలు), కుమార్తె అర్చన(3)తో కలిసి నగరానికి వచ్చాడు. మరో కూతురు అనూరాధ(6) అమ్మమ్మ, తాతల వద్దే ఉంది. అనంతప్ప కుటుంబం కొన్నాళ్లు బండ్లగూడలో తర్వాత గౌలిదొడ్డిలో ఉన్నారు. మూడు నెలల కిందటే గోపన్‌పల్లి ఎన్టీఆర్‌నగర్‌ వచ్చి అద్దెకుంటూ తాగునీటి క్యాన్లు సరఫరా చేసే ఆటో ట్రాలీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇల్లరికం వెళ్లిన అత్తగారింట్లో మరో వారంలో ఓ దేవత పూజ ఉండటంతో రావాలని ఇటీవల అత్త ఫోన్‌ చేసింది. బుధవారం ఉదయం ఊరికి వెళ్లేందుకు మంగళవారం రాత్రే అన్నీ సర్దుకున్నారు. వెళితే మళ్లీ ఇల్లరికంలోనే ఉండిపోవాల్సి వస్తుందని, అది జరగకూడదంటే.. తన భార్య, కుమారుడిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకోవాలని అనంతప్ప నిర్ణయించుకున్నాడు. బుధవారం ఉదయం 5.30 గంటలకే లేచి నిద్రలో ఉన్న భార్య ముఖం, గొంతుపై దుప్పటితో బలంగా నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. కుమారుడి గొంతుపై భార్య చేయినే వేసి బలంగా నొక్కి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు.

కూతురుకు చాయ్‌, బిస్కెట్‌ తెచ్చి ఇచ్చాక..
కొంత సేపటి తర్వాత బయటకు వెళ్లి కూతురు కోసం చాయ్‌, బిస్కెట్‌లు తెచ్చి ఇచ్చాడు. అనంతరం బెంగుళూరులో ఉన్న స్నేహితుడు శ్రీశైలకు ఫోన్‌ చేసి.. ఇదే తన చివరి ఫోన్‌కాల్‌ అని చెప్పాడు. శ్రీశైల వెంటనే నానక్‌రాంగూడలో ఉండే అనంతప్ప అన్న కొడుకు చెన్నప్పకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఈ లోపే.. ఇంట్లో అనంతప్ప గదిలోని ఫ్యాన్‌కు వైరుతో ఉరి వేసుకోగా అది తెగిపోయింది. దీంతో చేతికి విద్యుత్‌ తీగను చుట్టుకుని మరో కొసను ప్లగ్‌లో పెట్టాడు. విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. నానక్‌రాంగూడ నుంచి ఉదయం 8 గంటల సమయంలో చెన్నప్ప చేరుకుని తలుపులు తట్టగా చిన్నారి అర్చన తలుపులు తీసింది. దారుణం గమనించిన చెన్నప్ప ఇంటి యజమానికి తెలిపి 100నెంబరుకు ఫోన్‌ చేశాడు. తల్లి, ఆమె పొత్తిళ్ల వద్ద బాలుడు విగత జీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీరు పెట్టారు. పోలీసులు వచ్చి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడిని గచ్చిబౌలిలో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అతడిపై 302, 309 సెక్షన్‌ల కింద కేసులు నమోదుచేశామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

‘అత్తింటికి వంశం లేకుండా చేసేందుకు కుమారుడి హత్య’
తనకు భార్యంటే ఎంతో ప్రేమని, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని నిందితుడు అనంతప్ప తెలిపాడు. చిన్నవయసులోనే బలవంతంగా మేనత్త కూతురితో ఇల్లరికం పెళ్లి చేశారని అన్నాడు. తెల్లవారితే అత్తమామల ఇంటికి వెళ్లాల్సి ఉందని, అలా వెళ్లడం ఇష్టం లేకే భార్య, కొడుకును హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. అత్తింటికి వంశం లేకుండా చేయాలనే కొడుకుని చంపానని, వంశంతో సంబంధం ఉండదని కూతురును వదిలేశానని చెప్పాడు. తరచూ కల్లు తాగి వస్తుండటంతో ఇటీవల యజమాని అనంతప్పను పనిలోంచి తొలగించినట్లు తెలిసింది. వారం రోజులుగా అతడు కల్లు తాగుతున్నాడని, ఆ మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడిఉంటాడని స్థానికులు చెబుతున్నారు.

ఉలిక్కిపడిన గోపన్‌పల్లి
ఎపుడెప్పుడు తల్లిగారింటికి వెళదాం.. అన్న ఆశతో.. ఏడాదిన్నర కుమారుడిని గుండెకు హత్తుకుని, మరో పాపను పక్కనే పడుకోబెట్టుకుని నిద్రపోయిందా తల్లి.. భర్తే కాల యముడవుతాడని ఆమె ఊహించలేకపోయింది. నిద్రలో ఉండగానే ఆమెను, చిన్నారి కొడుకును హత్య చేశాడా జాలిలేని తండ్రి. తల్లీ, కుమారుల హత్యోదంతంతో గోపన్‌పల్లి ఎన్టీఆర్‌నగర్‌ ఉలిక్కిపడింది. తల్లి, ఆమె పొత్తిళ్ల వద్ద బాలుడు విగతజీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీరు పెట్టారు. తల్లి ఇక తిరిగి రాదని తెలియని మూడేళ్ల బాలిక దీన స్థితిని చూసి బస్తీ వాసులు చలించిపోయారు. ఆ చిన్నారిని బంధువులు చేరదీశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.