
తాజా వార్తలు
ముగ్గురు పిల్లలతో పాటు చెరువులో దూకిన తల్లి
ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు
కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అస్నాబాద్లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలో చెలరేగిన చిన్నపాటి గొడవల కారణంగా ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఒకరు మృతి చెందగా ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరు మండలం కొమ్మూరుకు చెందిన ఎల్లమ్మ(32) ఇంట్లో చిన్న గొడవ చోటుచేసుకోవడంతో మనస్తాపం చెందిన ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్దామని చెప్పి కొడంగల్ మండలం అస్నాబాద్కు వెళ్లింది. ఆ గ్రామంలోని పెద్దచెరువు వద్దకు పిల్లల్ని కాలినడకన తీసుకువెళ్లిన ఎల్లమ్మ అక్కడ వారితో కాసేపు కాలక్షేపం చేసింది. అనంతరం పెద్దకూతురు రజిత(9)ను, కుమారుడు రాజు(5)ను అకస్మాత్తుగా చెరువులో తోసేసింది. అలాగే మరో పాప అనిత(7)తో పాటు దూకేందుకు ప్రయత్నించగా పాప తప్పించుకుంది. దీంతో ఎల్లమ్మ చెరువులో పడిపోయింది. కొంతసేపటికి పాప అనిత చెరువు నుంచి ఏడ్చుకుంటూ గ్రామానికి వస్తుండగా స్థానికులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు చెరువులో వెతకగా రాజు మృతదేహం లభ్యమైంది. చీకటి పడడంతో గాలించేందుకు ఇబ్బందిగా మారింది. మిగిలిన వారి కోసం శుక్రవారం వెతికేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.