Fake Voter IDs: ఈసీఐ వెబ్‌సైట్‌ హ్యాక్‌ చేసి.. 10వేల  నకిలీ ఓటరు ఐడీలు సృష్టించి..!

తాజా వార్తలు

Published : 14/08/2021 01:07 IST

Fake Voter IDs: ఈసీఐ వెబ్‌సైట్‌ హ్యాక్‌ చేసి.. 10వేల  నకిలీ ఓటరు ఐడీలు సృష్టించి..!

యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు

మీరట్‌: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి భారీ సంఖ్యలో నకిలీ ఓటరు కార్డులు సృష్టించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహ్రాన్‌పూర్‌ జిల్లా నకుడ్ ప్రాంతంలో విపుల్‌ సైనీ అనే 21 ఏళ్ల యువకుడు మూడు నెలల్లోనే దాదాపు 10వేల ఓటరుకార్డులు సృష్టించినట్టు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి బ్యాంకు ఖాతాతో పాటు ఇంట్లో రెండు కంప్యూటర్లను సీజ్‌ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అర్మాన్‌ మాలిక్‌ అనే వ్యక్తి ఆదేశాలతోనే  సైనీ నకిలీ ఓటరు కార్డులు తయారుచేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఎన్నికల సంఘం అధికారులు వాడిన పాస్‌వర్డ్‌తో ఈసీఐ వెబ్‌సైట్‌ను వినియోగించినట్టు తెలుస్తోంది. అయితే, ఏదో తప్పు జరుగుతున్నట్టు గుర్తించిన ఈసీఐ అధికారులు దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇటీవలే యూపీలోని ఓ వర్సిటీ నుంచి బీసీఏ పూర్తిచేసినట్టు పోలీసులు తెలిపారు.

నిందితుడి ఖాతాలో ₹60 లక్షలు

ఈ ఘటనపై షహ్రాన్‌పూర్‌ సీనియర్‌ ఎస్పీ చెన్నప్ప మాట్లాడుతూ.. ఒక్కో కార్డు తయారుచేసినందుకు విపుల్‌ సైనీకి రూ.100 నుంచి 200 చెల్లించేవారని, అరెస్టు తర్వాత అతడి బ్యాంకు ఖాతాను పరిశీలిస్తే అందులో రూ.60లక్షలు డిపాజిట్‌ అయినట్టు గుర్తించామన్నారు. అతడి బ్యాంకు ఖాతాను స్తంభింపజేసినట్టు వెల్లడించారు.  ఈ కేసు మూలాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారన్నారు. మాలిక్‌ గురించి కూడా మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి రోజూ మాలిక్‌ తనకు వివరాలు పంపిస్తుంటాడని యువకుడు చెప్పినట్టు తెలుస్తోదన్నారు.  ఈ కేసు తదుపరి దర్యాప్తు కోసం నిందితుడిని దిల్లీకి తరలించేలా అధికారులు కోర్టు అనుమతి తీసుకుంటారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో దేశ విద్రోహశక్తుల, ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈసీఐ డేటాబేస్‌ పూర్తి సురక్షితమని ఎన్నికలసంఘం స్పష్టంచేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని