
తాజా వార్తలు
ఆర్టీసీ బస్సు ఢీకొని ఆరుగురికి గాయాలు
కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఆటోను గుర్తుతెలియని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన యడ్ల ప్రశాంత్, అతని కుటుంబ సభ్యులు ట్రాలీ ఆటోలో వేములవాడ రాజన్న దేవస్థానానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా.. సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టి వెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిద్దిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఢీకొట్టిన బస్సును బాధితులు గుర్తించలేకపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.