ఉద్యమకారిణిపై అత్యాచారం, కొవిడ్‌తో మృతి!
close

తాజా వార్తలు

Published : 11/05/2021 01:10 IST

ఉద్యమకారిణిపై అత్యాచారం, కొవిడ్‌తో మృతి!

టిక్రీ సరిహద్దులో ఘటన

దిల్లీ: దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ సామాజిక ఉద్యమకారిణి(25)పై గ్యాంగ్‌రేప్‌ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతనెలలో ఈ ఘటన జరిగిన అనంతరం.. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. అదే సమయంలో కొవిడ్‌ నిర్ధారణ కావడంతో పరిస్థితి విషమించి ఏప్రిల్‌ 30న ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో దర్యాప్తునకు ఆదేశించారు. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన యువతిపై అత్యాచరం జరిగినట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం), మహిళలపై ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రకటించింది.

ఎస్‌కేఎం ప్రకటన ప్రకారం, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువ ఉద్యమకారిణి(25), ‘కిసాన్‌ సోషల్‌ ఆర్మీ’కి చెందిన నలుగురు వ్యక్తులతో కలిసి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు హరియాణాలోని టిక్రీ సరిహద్దుకి బయలుదేరారు. ఏప్రిల్‌ 11న అక్కడి రైతుల నిరసనల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి దిల్లీకి వెళ్లే మార్గంలో ఆ నలుగురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర జ్వరంతో పాటు అస్వస్థతకు గురైన బాధిత మహిళ, దిల్లీలోని జగ్గార్‌ ఆసుపత్రిలో చేరారు. అదే క్రమంలో పరీక్షల్లో ఆమెకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో ఏప్రిల్‌ 30న ఆసుపత్రిలో కన్నుమూసినట్లు సమాచారం. అయితే, యువతి చనిపోయే ముందు తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆమె తండ్రికి ఫోన్‌లో తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హరియాణా పోలీసులు తెలిపారు. మూడు ప్రత్యేక బృందాల ద్వారా కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీస్‌ అధికారి విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

 ఘటన గురించి తెలిసిన వెంటనే కిసాన్‌ సోషల్‌ ఆర్మీపై చర్యలు తీసుకున్నామని టీక్రీలోని రైతు సంఘం వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. టిక్రీ సరిహద్దులో కిసాన్‌ సోషల్‌ ఆర్మీకి చెందిన టెంట్లు తొలగించడంతో పాటు ఆ బృందానికి చెందిన వారిని ఉద్యమంలో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన తమ సహఉద్యమకారిణి పక్షాన న్యాయం కోసం పోరాడుతామని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని