West Bengal: ఆరేళ్ల పసివాడు ఉన్నాడని కూడా చూడకుండా..
close

తాజా వార్తలు

Published : 15/06/2021 01:11 IST

West Bengal: ఆరేళ్ల పసివాడు ఉన్నాడని కూడా చూడకుండా..

సుప్రీం ముందు అత్యాచార బాధితుల ఆవేదన

కోల్‌కతా: ‘అడవిలోకి లాక్కెళ్లి, నలుగురు వ్యక్తులు గంటకు పైగా అత్యాచారం చేశారు..ఆరేళ్ల మనవడు ఉన్నాడని కూడా చూడలేదు..నా కోడలిని నిర్దయగా కొట్టారు’..ఇవన్నీ న్యాయం కోసం సుప్రీం మెట్లెక్కిన మహిళలకు జరిగిన అన్యాయాలు. పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వాళ్లకు జరిగిన దారుణాలు. ఇంత జరిగినా పోలీసులు నిందితులను రక్షిస్తూ..తమపై ఒత్తిడి చేస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో తమకు న్యాయం జరగాలని ఆ బాధితులంతా కోరుతున్నారు. 

దేశం దృష్టిని ఆకర్షించిన పశ్చిమ్‌ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలు..ఎంతో మంది అమాయకుల జీవితాలను నాశనం చేశాయి. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు అంతర్గత నివేదిక వాస్తవాలను వెల్లడిస్తోంది. ఈ క్రమంలో బాధితుల్లో ముగ్గురు మహిళలు తమకు న్యాయం జరగాలంటూ సుప్రీంకు వేర్వేరు అభ్యర్థనలు పెట్టుకున్నారు. 

‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు(మే 3)న 100 నుంచి 200 మంది మా ఇంటిని చుట్టుముట్టారు. ఇంటిని వదిలివెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరింపులకు దిగారు. నా కోడలిని దారుణంగా కొట్టారు. మరలా మే 4 అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు మా ఇంటిలోకి చొరబడ్డారు. నన్ను కొట్టి, కట్టేశారు. నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషం పోశారు. ఆరేళ్ల పసివాడి ముందే ఈ దారుణాలకు పాల్పడ్డారు. తాము మరొక పార్టీకి మద్దతు ఇచ్చినందువల్లే మాపై ఈ దాడులు జరిగాయి. దీనిపై మొదట పోలీసులు కేసు స్వీకరించలేదు’ అంటూ ఓ 60 ఏళ్ల మహిళ తన పిటిషన్‌లో ఆరోపించారు. ‘చరిత్రపరంగా చూసుకుంటే..యుద్ధంలో శత్రువులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇలా అత్యాచారాలకు పాల్పడేవారు. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీకి మద్దతు ఇస్తున్నవారిని శిక్షించేందుకు వాడుతున్నారు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు. 

‘నలుగురు వ్యక్తులు నన్ను అడవిలోకి లాక్కెళ్లి..సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గంటపాటు తీవ్రంగా హింసించారు. తమ కుటుంబం మద్దతు ఇస్తోన్న పార్టీ, మేం అనుసరిస్తోన్న మతమే ఈ దాడికి కారణం. అలాగే నేను పెట్టిన కేసును వెనక్కి తీసుకోమని తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారు. నన్ను ఇప్పుడు సంక్షేమ గృహానికి పంపారు. నా కుటుంబాన్ని కలుసుకోనివ్వడం లేదు’ అంటూ 17 ఏళ్ల బాలిక తనకు జరిగిన దారుణాన్ని న్యాయస్థానం ముందుంచారు. 19 ఏళ్ల యువతి కూడా ఈ తరహా ఆరోపణలే చేశారు. పోలీసులు, చట్టబద్ధ సంస్థలు తమకు న్యాయం చేయడానికి బదులు శక్తివంతమైన నిందితులను రక్షిస్తున్నారని వారంతా వాపోయారు. ఈ ఘటనలన్నింటిని చెదురుమదురు ఘర్షణలుగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఇతర బాధిత కుటుంబాలతో కలిసి వీరంతా పిటిషన్లు వేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఈ పిటిషన్లపై దర్యాప్తు జరిపించాలని, అది కూడా రాష్ట్రం వెలుపల జరగాలని వారంతా అభ్యర్థించారు. 

ఇదిలా ఉండగా..ఎన్నికల వేళ, అనంతరం జరిగిన ఘర్షణలపై సుప్రీం.. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం, ఎన్‌హెచ్ఆర్‌సీ, ఎన్‌సీపీసీఆర్, ఎన్‌సీడబ్ల్యూ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కోల్‌కతా హైకోర్టుకు చెందిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం సిట్‌ ఏర్పాటుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తోందనంటూ అదే రోజు బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకు వెల్లడించింది. ఆ ఘటనల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు తమ అంతర్గత నివేదిక వెల్లడిచేస్తుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. ఈ వ్యవహారంపై న్యాయస్థానం మంగళవారం విచారణ జరపనుంది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని