
తాజా వార్తలు
పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద నగదు సీజ్
కర్నూలు(క్రైమ్): కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద రూ.72.50లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సును ఎస్ఈబీ పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఈ నగదు పట్టుబడింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన మహమ్మద్ నౌషద్ అనే ప్రయాణికుడి బ్యాగు నుంచి స్వాధీనం చేసుకున్నారు. తొలుత అతడి బ్యాగు తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఓ వాహనానికి సంబంధించిన విడి భాగాలు ఉన్నట్లు ఎస్ఈబీ సిబ్బందిని నమ్మించాలని చూశాడు. అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా డబ్బు బయటపడింది.
నౌషద్‌ను విచారించగా తనది మంగళూరు అని.. మహమ్మద్ సౌఫాన్ అనే వ్యాపారి వద్ద పనిచేస్తున్నట్లు చెప్పాడు. వక్కపొడి వ్యాపారం చేసే తన యజమానికి సంబంధించిన డబ్బును నాగ్‌పుర్ నుంచి తీసుకొస్తున్నట్లు విచారణలో వెల్లడించాడు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో అధికారులు నగదును సీజ్ చేసి నౌషద్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు.