భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!
close

తాజా వార్తలు

Published : 23/04/2021 01:07 IST

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!

ఆపై ఉరివేసుకొని ఆత్మహత్య 

పమిడిముక్కల: భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కృష్ణాపురానికి చెందిన చీలి మధుకి మంగళగిరికి చెందిన మాధవితో 2010లో వివాహం జరిగింది. వీరికి చరణ్‌, సంజయ్‌ ఇద్దరు కుమారులు. పిల్లలిద్దరూ స్థానిక పాఠశాలలో చదువుతుండగా రెండు రోజుల క్రితం ఇచ్చిన సెలవులకి నాయనమ్మ ఇంటికి వెళ్లారు. దీంతో మంటాడలో భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటి తలుపులు మూసి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. కాలిన గాయాలు, కొనఊపిరితో మాధవి ఇంట్లో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పక్కగదిలో మధు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో మాధవి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. తనపై భర్త మధు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని చెప్పిన ఆమె.. కొద్దిసేపటికే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారణాలపై విచారణ చేపట్టారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని