
తాజా వార్తలు
నష్టజాతకుడని కొడుకును చంపిన తండ్రి
చెన్నై: మూఢత్వం మనిషిని మూర్ఖుడిగా మార్చేస్తోంది. వివేకం, విచక్షణ మరిచి విపరీతాలకు పాల్పడేలా చేస్తోంది. ఆ మధ్య చిత్తూరు జిల్లాలో మూఢనమ్మకాల కారణంగా కన్నకూతుళ్లనే చంపేశారో తల్లిదండ్రులు. ఇప్పుడు తమిళనాడులోనూ అలాంటి దారుణమే చోటుచేసుకుంది. కొడుకు నష్టజాతకం కారణంగా నీ ప్రాణాలకు ముప్పు ఉందని జ్యోతిష్కుడు చెప్పిన మాటలు నమ్మిన ఓ తండ్రి.. ముక్కుపచ్చలారని నాలుగేళ్ల కొడుకును చంపేశాడు. ఒంటికి నిప్పంటించి సజీవదహనం చేశాడు. తిరువారూర్‌లో గత నెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరువారూర్‌లోని నన్నిళం ప్రాంతానికి చెందిన రాంకీ.. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జ్యోతిష శాస్త్రాన్ని విపరీతంగా నమ్మే అతడు.. తరచూ పలు జ్యోతిష్కులను సంప్రదిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ జ్యోతిష్కుడు ‘నీ కొడుకు నష్టజాతకుడు.. అతడి వల్ల ఇబ్బందులు తప్పవు’ అని రాంకీకి చెప్పాడు. కొడుకు వల్ల ప్రాణహాని ఉందని, ఓ 15 ఏళ్ల పాటు అతడిని దూరంగా ఉంచాలని సలహా కూడా ఇచ్చాడట.
అతడి మాటలు నమ్మిన రాంకీ.. కొడుకును కొన్నాళ్ల పాటు తన బంధువుల ఇంట్లో ఉంచాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఆయన భార్య ఒప్పుకోలేదు. ఇదే విషయమై ఫిబ్రవరి 25న భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న రాంకీ.. విచక్షణ కోల్పోయి తన నాలుగేళ్ల కొడుకు ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని తల్లి స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే చిన్నారి శరీరం 90శాతం కాలిపోయింది. చికిత్స పొందుతూ బాలుడు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రాంకీని అరెస్టు చేశారు. విచారణలో తానే నేరం చేసినట్లు అతడు అంగీకరించాడు.