
తాజా వార్తలు
జిలెటిన్ స్టిక్స్ పేలుడు: ఆరుగురి మృతి
బెంగళూరు: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో పేలుడు చోటుచేసుకుంది. జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్‌బళ్లాపూర్ జిల్లా హీరానాగవేలి సమీపంలో రాతి క్వారీలో కొద్ది రోజుల కిందట జిలెటిన్ స్టిక్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు వాటిని ఉపయోగించేందుకు అనుమతి లేదని కాంట్రాక్టర్ సిబ్బందికి సూచించారు. ఈక్రమంలో సిబ్బంది జిలెటిన్ స్టిక్స్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించగా.. పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
కాగా సంఘటనా స్థలాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే సుధాకర్ సందర్శించారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసిన మైనింగ్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.