close

తాజా వార్తలు

కోడి పేరున కోట్లాట

చేతులు మారిన రూ. కోట్లు

యథేచ్ఛగా జూదం

ఏలూరు మండలం చొదిమెళ్లలో కోడి పందేల బరి 

సంక్రాంతి పండుగ పేరిట పశ్చిమలో మరోసారి జూదం జడలు విప్పింది. జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు, పేకాట, గుండాట వంటి జూదాలు యథేచ్ఛగా సాగాయి. గడిచిన మూడు రోజుల్లో రూ. వందల కోట్లు చేతులు మారి ఉంటాయని అంచనా. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో పందేలను నిర్వహించారు. ఈసారి పందేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు. పందెంరాయుళ్లు మాత్రం ఎప్పటిలాగే చివరి నిమిషంలో అయినా కచ్చితంగా అనుమతి వస్తుందనే నమ్మకంతో ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరికి పందెం కోడి గెలిచింది. సీసీ కెమెరాల నిఘాలో... వీక్షకులకోసం ఏర్పాటు చేసిన భారీ స్కీన్ల నడుమ పందేలు యథేచ్ఛగా సాగాయి.

 

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే : సంక్రాంతికి జూదం పేరుతో రూ. కోట్లు చేతులు మారాయి. కోడి పుంజులకు కత్తులు లేకుండా, గుండాట వంటివి లేకుండా పందేల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రతి చోటా కోడిపుంజులకు కత్తులు కట్టే పందేలు నిర్వహించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కోడిపందేల బరుల వద్దే గుండాటను యథేచ్ఛగా నిర్వహించారు. పందేల నిర్వాహకులకు అధిక ఆదాయం గుండాట ద్వారానే వస్తుందనేది తెలిసిందే. కొన్నిచోట్ల పందేలు, గుండాటతోపాటు పేకాట కూడా నిర్వహించారు. పందేల నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండ ఉండటంతో పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. జిల్లాలో భీమవరం, ఆకివీడు, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆచంట, పెనుగొండ, అత్తిలి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు, ఏలూరు, తాడేపల్లిగూడెం, గణపవరం, ఉండి తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించారు.

 

సంప్రదాయం మాటున వ్యాపారం..

పశ్చిమలో ప్రతి పల్లెలో సంక్రాంతికి సంప్రదాయంగా కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాలక్రమంలో పందేల తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు గ్రామాల్లోని వీధుల్లో సరదా కోసం నిర్వహించే పందేలు కాస్తా గత కొన్నేళ్లుగా వ్యాపారంగా మారిపోయాయి. కొంత మంది ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వేలు, లక్షలు ఇలా పందేల స్థాయిని బట్టి బరులను ఏర్పాటు చేశారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. బరుల వద్ద బిర్యానీ, భోజనం, చికెన్‌ పకోడి, కొబ్బరి బోండాలు, శీతల పానీయాల దుకాణాలను నిర్వహించారు. నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండ ఉండటంతో పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర పోషించారు.

నిబంధనలు గాలికి

కోడి పందేలు, గుండాట, పేకాట వంటివి నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలున్నాయి. వాటిపై పోలీసులు పండుగకు ముందు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. కలెక్టర్‌ సైతం హెచ్చరించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రెవెన్యూ, పోలీసు శాఖ కలిపి గ్రామాల్లో బ్యానర్లను ఏర్పాటు చేశారు. జూదం నిర్వహిస్తే ఎలాంటి చర్యలుంటాయనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కోడి పందేలు నిర్వహించే అవకాశం ఉన్న అనేక మందిపై పోలీసులు ముందస్తుగా బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. అయినా అవన్నీ గాల్లో కలిసిపోయాయి. నాలుగు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పందేలు యథేచ్ఛగా జరిగాయి.

గణపవరం, న్యూస్‌టుడే : నారాయణపురం, కొత్త ఉంగుటూరు, బాదంపూడి, గుండుగొలను, పూళ్ల, పత్తేపురం, గణపవరం, పిప్పర, మొయ్యేరు గ్రామాల్లో భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేసి పందెం రాయుళ్లకు ఆహ్వానం పలికారు. భోగి రోజున మొదలైన పందేలు కనుమ రోజుతో ముగిశాయి. ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల మేర చేతులు మారాయి. బరుల వద్దే కోతాట, గుండాటలను ఏర్పాటు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా జూదక్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పందేలను చూసేందుకు దేశ, విదేశాల్లో ఉన్న వారితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, యువత పెద్ద ఎత్తున వచ్చారు.

నరసాపురం, న్యూస్‌టుడే : ఈ మూడు రోజుల పాటు నరసాపురం నియోజకవర్గంలో జరిగిన పందేల్లో రూ.15 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. అన్ని బరుల వద్ద మద్యం ఏరులైపారింది. నరసాపురం మండలంలో లక్ష్మణేశ్వరంలో మూడు చోట్ల, రాజుల్లంక, వేములదీవిపడమరలో రెండు చోట్ల, తూర్పుతాళ్లు, లిఖితపూడి, నరసాపురం పట్టణ పరిధి పీచుపాలెం, రుస్తుంబాద, చినమామిడిపల్లి, మొగల్తూరు మండలం పరిధి కొత్తపాలెం, మొగల్తూరులో 5 చోట్ల, కాళీపట్నం, వారతిప్ప, పేరుపాలెంసౌత్‌, కెపీపాలెంనార్త్‌, రామన్నపాలెం పరిధిలో బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. ప్రధానంగా కొత్తపాలెం బరిలో పెద్ద ఎత్తున పందెలు జరిగాయి. ఇక్కడ ఒక్కొక్క పందెం రూ.10 లక్షల వరకు వెళ్లింది.

కోడిపందేల్లో వివాదం.. ఇద్దరికి గాయాలు

సీతానగరం(చింతలపూడి గ్రామీణ), న్యూస్‌టుడే: కోడిపందేల సందర్భంగా జరిగిన వివాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి మండలం చింతంపల్లి గ్రామంలో నిర్వహించిన కోడిపందేల్లో పాల్గొనేందుకు సత్తుపల్లి నుంచి కొందరు వ్యక్తులు వచ్చారు. ఈ సందర్భంగా వీరు యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులతో పందెం కట్టారు. పందెం పూర్తయిన తర్వాత డబ్బుల విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా కర్రలతో విచక్షణారహితంగా దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరికి గాయాలైనట్లు చెబుతున్నారు.

 

చింతలపూడిలో ..

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: కోడి పందేల నిర్వాహకులకు సంప్రదాయాల ముసుగు బాగా పనిచేసింది. నిషేధాజ్ఞలు, కోర్టు ఉత్తర్వులు ఉన్నా బరి తెగించడంతో యథేచ్ఛగా కోడి పందేలు జరిగాయి. కోడి పందేలతో పాటు విచ్చలవిడిగా గుండాట, కోతాట, లోన బయట వంటి జూద క్రీడలు అధిక మయ్యాయి. చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో దాదాపు 25 నుంచి 30 చోట్ల పందేలను నిర్వహించారు.చాలా చోట్ల రాజకీయ నాయకులు వీటిని ప్రారంభించారు. చింతలపూడి మండలం ప్రగడవరంలో కోడి కత్తి ఒక వ్యక్తిని బలితీసుకుంది. చింతంపల్లిలో పందెగాళ్ల మధ్య గొడవలు జరిగి కొట్టుకోవడంతో ఇద్దరు గాయాలపాలయ్యారు. పందెగాళ్లు, జూదరులకు ఈ ఏడాది వినోదంతోపాటు విషాదాన్ని మిగిల్చింది. లోన బయట ఆటల్లో మోసాలు జరగకుండా పాదర్శకత కోసం నిర్వాహకులు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. 14వ తేదీ భోగి రోజు ఉదయం 11.30 గంటల వరకు పందేలు జరగకుండా కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు పికెట్లు కొనసాగాయి. ఆ తరువాత పోలీసుల జాడ కనిపించలేదు. నిర్వాహకులు చకచకా పందిళ్లు వేయడం, పందెం రాయుళ్లు రావడం పందేలు వేయడం అన్నీ ఆఘమేఘాల మీద జరిగాయి.

 

పందులకుసైతం

సంక్రాంతి సందర్భంగా పోటీలు

కుంచనపల్లి (తాడేపల్లిగూడెం గ్రామీణ), న్యూస్‌టుడే: సంక్రాంతి అనగానే ఠక్కున గుర్తొచ్చేది కోడి పందేలు. ఆ తర్వాత ఎద్దులు, పొట్టేళ్ల పందేలు. వాటికి భిన్నంగా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో బుధవారం పందుల పోటీలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం - అలంపురం, పశ్చిమ - తూర్పుగోదావరి జిల్లాల తరఫున పోటీలు నిర్వహించగా అలంపురం, పశ్చిమ గోదావరికి చెందిన పందులు విజేతగా నిలిచాయి. ఒక్కో పందేనికి నిర్వాహకులు రూ.50 వేల చొప్పున కాయగా, పందెంరాయుళ్లు బయట పందేలను రూ.లక్షల్లో కాసుకున్నారు. మూడో పందేనికి సంబంధించి పంది బరిలోకి దిగగానే పారిపోయింది. పోటీలను తిలకించడానికి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు పందెంరాయుళ్లు హాజరయ్యారు. తమ తాతముత్తాల నుంచి పందుల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఆ ఆచారం ప్రకారం పందుల పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు సింగం సుబ్బారావు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.