
తాజా వార్తలు
భార్యను పుట్టింటికి పంపి..భర్త అదృశ్యం
మూసాపేట, న్యూస్‌టుడే: భార్యను పుట్టింటికి పంపించి తర్వాత ఇల్లు ఖాళీ చేసి భర్త పరారయ్యాడు. కూకట్పల్లి ఠాణా పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..కూకట్పల్లి షంషీగూడలో సతీష్(35), సంధ్యారాణి కుటుంబం అద్దెంట్లో నివాసముంటోంది. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. దుస్తుల షోరూంలో సతీష్ పనిచేస్తుండగా.. సంధ్యారాణి గృహిణి. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న భార్య, పిల్లలను మిర్యాలగూడలోని అత్తారింటికి పంపించాడు. తనకు వ్యాపార పనులున్నాయని చెప్పి వెళ్లలేదు. తరువాత 13వ తేదీ నుంచి అతడి సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది. అనుమానంతో మంగళవారం ఇంటికి వచ్చిన భార్య హతుశురాలైంది. తాము ఉంటున్న ఇంటిని భర్త ఖాళీ చేసి అప్పటికే వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించారు.
మరో ఘటనలో కోర్టుకు వెళ్లిన యువకుడు.. మియాపూర్ పరిధి మదీనగూడకు చెందిన జి.బాలరాజు(32) రియల్ ఎస్టేట్ వ్యాపారి. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తన మిత్రుడు అభిలాష్‌తో కలిసి కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లోని న్యాయస్థానానికి వచ్చాడు. సాయంత్రం తన మిత్రుడికి చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ స్విచ్ఛాప్ అయింది. దీంతో బాలరాజు తమ్ముడు అంజన్‌కుమార్ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రెండు అదృశ్యం కేసులను పోలీసులు విచారిస్తున్నారు.