close

తాజా వార్తలు

మాయ కి‘లేడీ’లు అరెస్టు..

రూ.3.25 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: ఓ బంగారు దుకాణంలో ఆభరణాలను చోరీ చేసిన దొంగలను పాల్వంచ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పాల్వంచ పట్టణ పోలీసుస్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు నిందితుల వివరాలను వెల్లడించారు. ఏపీ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లికి చెందిన మెచ్చెర్ల రేణుక, బొజ్జగాని జ్ఞానమ్మ, బొజ్జగాని నాగమణి అనే ముగ్గురు మహిళలు బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తుంటారు. దుకాణంలో ఒక్కరే ఉంటే పని సులభంగా పూర్తి చేసుకుని అక్కడి నుంచి బంగారు వస్తువులతో ఉడాయించడం వీరి ప్రత్యేకత. నకిలీ ఆభరణాలను ధరించుకుని దుకాణంలోకి వెళ్తారు. ముందుగా ఓ మహిళా దుకాణంలోకి వచ్చి వ్యాపారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో మరో మహిళా వచ్చి నగల విలువ, వాటి వివరాలను అడుగుతూ ఉంటుంది. ఈ లోగా మరో మహిళా వచ్చి బంగారం ధర, ప్రస్తుతం నడుస్తున్న మోడళ్ల వివరాలను సేకరిస్తుంది. నగల వ్యాపారిని మాటల్లో పెట్టి ఆభరణాలను పెట్టుకుని చూడొచ్చా అంటూ అడుగుతారు. సీసీ కెమెరాలున్నాయి కదా.. ఏం కాదులే అన్న ధైర్యంతో పెట్టుకోవచ్చంటూ వ్యాపారులు బదులిస్తారు. ఇదే సమయంలో తమ ఒంటిపై ఉన్న నకిలీ ఆభరణాలను తీసి నిజమైన ఆభరణాలను పెట్టుకుంటారు. మిగిలిన మహిళలు వ్యాపారితో బేరసారాలు కొనసాగిస్తుండగా ఈలోగా నిజమైన బంగారాన్ని తీసినట్లుగా తీసి పాతవాటిని ఇచ్చేస్తారు. చాలామంది వ్యాపారులు ఆభరణాలను గమనించకుండా తీసుకుని మోసపోతారు.

ఈనెల 10న చోరీ..: ఇదే క్రమంలో పాల్వంచ పట్టణ పరిధిలోని శాస్త్రీరోడ్‌లో ఉన్న అంబికా జ్యూయలరీలో ఈ నెల 10న మధ్యాహ్నం ముగ్గురు మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తామంటూ వచ్చి 9 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దుకాణ నిర్వాహకుడు నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పాల్వంచ పట్టణ సీఐ నవీన్‌, ఎస్సై ప్రవీణ్‌ తన సిబ్బందితో విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా వారి కదలికలను గుర్తించారు. ఎటువైపు నుంచి వచ్చారు? ఎటు వెళ్లారు? అంటూ క్షేత్రస్థాయిలో కొంతమందిని విచారించి స్థానిక దొంగల పని కాదనే నిర్ణయానికి వచ్చి విచారణ వేగవంతం చేశారు. శుక్రవారం పట్టణంలోని నట్రాజ్‌ సెంటర్‌లో ఎస్సై ప్రవీణ్‌ సిబ్బందితో వాహన తనిఖీలు చేపడుతున్నారు. ముగ్గురు మహిళలు అనుమానస్పదంగా సంచరించడం గమనించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో బంగారు దుకాణంలో చోరీ చేసిన విషయం బయటకొచ్చింది. నిందితుల నుంచి రూ.3.25 లక్షలు విలువ చేసే 13 జతల బంగారు చెవి కమ్మలు, బుట్టలను రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. కృష్ణా జిల్లాలోని పలు ఠాణాల్లో వీరిపై కేసులున్నట్లుగా డీఎస్పీ ప్రసాద్‌రావు వివరించారు. అనంతరం విచారణ వేగవంతం చేసి బంగారు ఆభరణాలను రికవరీ చేసిన ఎస్సై ప్రవీణ్‌, కానిస్టేబుళ్లు లక్ష్మణ్‌, రవిలకు రివార్డును ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్వంచ సీఐ నవీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.