close

తాజా వార్తలు

తరిమి.. తరిమి.. నరికారు

తిరుచ్చిలో భాజపా ప్రముఖుడి హత్య

నిరసనగా కార్యకర్తల రాస్తారోకో

● ఆస్పత్రిలో విజయరఘు మృతదేహం ●విజయరఘు (పాత చిత్రం) ●

చెన్నై, న్యూస్‌టుడే: తిరుచ్చిలో భాజపా ప్రముఖుడిని ఓ ముఠా దారుణంగా హత్య చేసింది. టీ తాగడానికి స్థానిక మార్కెట్‌కు తెల్లవారుజామున వచ్చిన అతన్ని దుండగులు తరిమి.. తరిమి.. కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులను అరెస్టు చేయాలని బంధువులు, భాజపా కార్యకర్తలు రాస్తారోకో చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. తిరుచ్చి పాలకరై ప్రాంతానికి చెందిన విజయరఘు(40) భాజపా జోనల్‌ కార్యదర్శిగా ఉన్నారు. స్థానిక గాంధీ మార్కెట్‌లో ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు టోకెన్లు ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున టీ తాగడానికి మార్కెట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఐదుగురు సభ్యుల ఓ ముఠా వేట కొడవళ్లతో అతనిపై దాడికి పాల్పడింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ప్రాణాలు దక్కించుకోవడానికి వారి నుంచి తప్పించుకుని పరిగెత్తాడు. అయితే ఆ ముఠా ఆయన వెంటపడి వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయరఘు అక్కడే పడిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడిపోయిన అతనిని తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి విషయం తెలిసిన వెంటనే విజయరఘు బంధువులు, భాజపా నిర్వాహకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు, పార్టీ కార్యకర్తలు అక్కడే రాస్తారోకో చేపట్టారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. లాటరీ వ్యాపారి మహ్మద్‌ బాబు అలియాస్‌ మిఠాయ్‌ బాబు ఈ హత్యకు పాల్పడినట్లు వారు ఆరోపించారు. ఇంటి సమీపంలో విజయరఘు నిర్వహించిన టిఫిన్‌ దుకాణం నుంచి గత ఏడాది మిఠాయ్‌ బాబు సెలఫోన్‌ చోరీ చేశాడని, ఈ విషయమై వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందన్నారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయన్నారు. లాటరీ విక్రయాల గురించి పోలీసులకు విజయరఘు సమాచారం అందించారనే అనుమానంతో గతంలో రెండు సార్లు మిఠాయ్‌ బాబు అతనిపై హత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. ఓ సారి విజయరఘు, అతని బావమర్ధిపై వేట కొడవలిలో హత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నెల 11వ తేదీ అతను బెయిల్‌పై విడుదల కాగా సోమవారం తెల్లవారుజామున విజయరఘు హత్యకు గురికావడం గమనార్హం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వరగనేరికి చెందిన మిఠాయ్‌ బాబు కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

హత్యపై మతం రంగు

హతుడు భాజపా ప్రముఖుడు కావడం, నిందితుడు ముస్లిం కావడంతో ప్రస్తుత హత్యకు మతం రంగు పులుముకుంది. ముస్లిం తీవ్రవాది చేతిలో భాజపా జోనల్‌ కార్యదర్శి హత్యకు గురైనట్లు కేంద్ర మాజీ మంత్రి పొన్‌.రాధాకృష్ణన్‌ ఆరోపించారు. హిందూ భావజాలం ఉంటే హత్య చేయాలనే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎంకే, కాంగ్రెస్‌లు వేర్పాటు వాద రాజకీయాలను మానుకోవాలని సూచించారు. ప్రజలంతా సమైక్యంగా ఉండాలని పేర్కొన్నారు. విజయరఘుని ముస్లిం తీవ్రవాది హత్య చేయడం ఖండించదగిందంటూ భాజపా జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే అభిప్రాయాన్ని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సీపీ రాధాకృష్ణన్‌ వ్యక్తం చేశారు. తిరుచ్చి ఐజీ కార్యాలయానికి కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీగా వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కార్యకర్తలను ఐజీ కార్యాలయ ప్రాంగణం బయటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులతో సీపీ రాధాకృష్ణన్‌ తదితరుల వాగ్వాదానికి దిగారు. తర్వాత కొద్ది మంది ప్రతినిధులను మాత్రమే అనుమతించడంతో ఐజీ, ఇతర అధికారులకు భాజపా నిర్వాహకులు వినతిపత్రాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా విజయరఘు హత్యకు మతం రంగు పులుముకోవడాన్ని ఐజీ అమల్‌రాజ్‌ ఖండించారు. ఈ హత్యకు మతం కారణం కాదని ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యను మహ్మద్‌ బాబు ఒక్కడే చేయలేదని, ముఠాలోని వారంతా అదే మతం వారు కాదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాధాకృష్ణన్‌ తదితరులను అడ్డుకుంటున్న పోలీసులు


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.