నన్ను లైంగికంగా వేధించారు: నిర్భయ దోషి

తాజా వార్తలు

Updated : 29/01/2020 00:49 IST

నన్ను లైంగికంగా వేధించారు: నిర్భయ దోషి

పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌


దిల్లీ: క్షమాభిక్ష పిటిషన్‌ను సవాలు చేస్తూ నిర్భయ దోషి ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ వేసిన పిటిషన్‌కు సంబంధించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్‌లో పెట్టింది. బుధవారం తీర్పును వెలువరించనున్నారు. ముకేశ్‌ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది. ముకేశ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అంజనా ప్రకాశ్‌ హాజరుకాగా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు. న్యాయస్థానం ఎదుట ఇరువురు తమ వాదనలు వినిపించారు. 

తీహాడ్‌ జైల్లో ముకేశ్‌ను లైంగికంగా వేధింపులకు గురి చేశారని అతడి తరఫు హాజరైన న్యాయవాది అంజనా ప్రకాశ్‌ కోర్టుకు తెలిపారు. దోషి జీవితంతో ఆడుకుంటున్నారా అని వాదనల సందర్భంగా ఆమె ప్రభుత్వం తరఫు హాజరైన న్యాయవాదిని ప్రశ్నించారు. క్షమాభిక్ష అభ్యర్థన పెట్టిన సమయంలో దోషికి సంబంధించిన అన్ని రికార్డులను రాష్ట్రపతి ముందు పెట్టాలి కానీ అధికారులు అలా చేయలేదని ఆమె కోర్టుకు తెలియజేశారు. అందువల్లే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారని ఆమె ఆరోపించారు. కోర్టులు మరణశిక్ష విధించమనే తీర్పు ఇచ్చాయని కానీ, తన పిటిషనర్‌ను జైల్లో లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తీహాడ్‌ జైల్లో ముకేశ్‌ను తీవ్రంగా కొట్టినట్లు ఆమె ఆరోపించారు. 

‘రాష్ట్రపతి ప్రతీ పత్రాన్ని చూసి తర్వాతే నిర్ణయం తీసుకుంటారని మీరు భావిస్తున్నారా? దోషికి సంబంధించిన అన్ని పత్రాలు పెట్టలేదని మీరు ఎలా చెప్పగలరు? అంటే రాష్ట్రపతి ఏమీ ఆలోచించకుండా అభ్యర్థనను తిరస్కరించారని మీరు ఎలా చెప్తారు’? అని సుప్రీంకోర్టు ముకేశ్‌ న్యాయవాదిని ప్రశ్నించింది. 

ప్రకాశ్‌ చేసిన ఆరోపణలను ప్రభుత్వం తరఫు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తిప్పికొట్టారు. ‘జైల్లో దోషి పడిన బాధను క్షమాభిక్ష కింద పరిగణనలోకి తీసుకోరు. ముకేశ్‌ ఒక్కడినే ఒక సెల్‌లో దీర్ఘకాలం ఉంచలేదు. కొన్ని రోజుల పాటు మాత్రమే వేరే సెల్‌లో పెట్టారు. కొన్ని కేసుల్లో ఉరిశిక్ష పడిన దోషుల మానసిక పరిస్థితి క్షీణిస్తే వారికి మరణశిక్ష వెంటనే అమలు చేయడం కుదరదు. కానీ ఈ కేసులో అలా కాదు. ఉరి శిక్ష పడిన ముకేశ్‌ మానసిక పరిస్థితి చాలా బాగుంది’ అని ఎస్‌జీ న్యాయస్థానానికి తెలియజేశారు. అందువల్ల దోషి పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా ఎస్‌జీ న్యాయస్థానాన్ని కోరారు.

ముకేశ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 17న తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో అతడు క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరణపై జ్యుడీషియల్‌ రివ్యూ కోరుతూ రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిర్భయ దోషులను ఫిబ్రవరి 1, ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాల్సిందిగా దిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉరి శిక్ష మరికొన్ని రోజుల్లో అమలు చేస్తారనగా దోషి ఈ పిటిషన్‌ వేయడం గమనార్హం. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని