ఆర్టీసీ చిల్లర కొట్టుడు!
close

తాజా వార్తలు

Published : 17/02/2020 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్టీసీ చిల్లర కొట్టుడు!

సర్దుబాటు పేరుతో రూ.1 -రూ.5వసూలు

ఈనాడు - హైదరాబాద్‌: చిల్లర సమస్య నుంచి ఒడ్డెక్కడానికి అంటూ ప్రయాణికులకు ఆర్టీసీ టోపీ పెడుతోంది. ఆ విషయాన్ని ప్రయాణికులకు చెప్పకుండా.. టిక్కెట్‌ చేతిలో పెట్టి, చిల్లర ఇవ్వాల్సిన పనిలేకుండా కండక్టర్లు చేతులు దులిపేసుకుంటున్నారు. చిల్లర సమస్య ఉండొద్దని అశాస్త్రీయంగా తమనుంచి రూ.1 నుంచి రూ.5 వరకు లాగేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇదేం లెక్కో..!
మెదక్‌ డిపోకు చెందిన బస్సు అది. నగరానికి వస్తోంది. ఓ ప్రయాణికుడు చేగుంట దగ్గర ఎక్కాడు. అక్కడి నుంచి జూబ్లీ బస్సు స్టేషన్‌కు టిక్కెట్టు కోసం రూ.వంద ఇచ్చాడు. కండక్టర్‌ తిరిగి రూ.15 ఇచ్చాడు. టిక్కెట్టు ధర రూ.74.00, టోల్‌ ప్లాజా ఛార్జీలంటూ మరో రూ.7, పన్ను రూ.1 అని టిక్కెట్టుపై చూపారు. ఈ లెక్కన మొత్తం ధర రూ.82 కావాలి. కానీ టిక్కెట్టుపై మాత్రం రూ.85 ఉంది. కండక్టరూ అంతే తీసుకున్నాడు. అలా ఎలా తీసుకుంటారని ప్రయాణికుడు కండక్టర్‌ని ప్రశ్నించాడు. చిల్లర సమస్య లేకుండా సర్దుబాటు చేశామని తాపీగా చెప్పారు. రూ.82లు సర్దుబాటు రూ.80 చేసుకోవాలని గానీ ఇదేం సర్దుబాటంటే కండక్టర్‌ నుంచి సమాధానం లేదు.

ప్రయాణికులపైనే భారం..
టిక్కెట్టు ధర ఒక్క రూపాయి అటైనా.. ఇటైనా ప్రయాణికుడి జేబుకే ఆర్టీసీ చిల్లుపెడుతోంది. నగరంలోనూ అదే పరిస్థితి. ఉదాహరణకు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కనీస టిక్కెట్టు ధర రూ.10. ప్రతి రెండు కిలోమీటర్లకు ధర మారుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కిలోమీటరు దగ్గర 20 పైసలు పెంచమని ఆర్టీసీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ లెక్కన తర్వాత వచ్చే రెండో స్టేజీకి రూ.10.40 తీసుకోవాలి. రూ.15 వసూలు చేస్తున్నారు. అలాగే 3, 4 స్టేజీల వరకూ రూ.15 ఉంచితే.. 5వ స్టేజీకి వచ్చేసరికి ఒక్కసారి రూ. 20 అవుతోంది.

రూపాయి దగ్గర రూ.5 పెరుగుతోంది..
గతంలో టిక్కెట్టు ధరలు రూ.1.70 ఉంటే అది రూ. 2 అయ్యేది. ఇప్పుడు ఒకటి, రెండు అనేది లేకుండా రూ.5 చొప్పున పెంచుతూ పోతున్నారని నగర ప్రయాణికులు వాపోతున్నారు. బస్సులో సీటు దొరుకుతుందా అంటే అదీ లేదు. బస్సులు తగ్గించారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ బస్సులకంతే: రాజశేఖర్‌, ఆర్‌ఎం మెదక్‌
ఇటీవల టిక్కెట్టు ధరలు పెంచినప్పుడు చిల్లర సమస్య తలెత్తకుండా ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సులకు రూపాయి పెరిగితే రూ.5 పెంచాం. ఆర్డినరీ బస్సులకు రూ.82 అయితే రూ. 80 చేయాలని, రూ.3 కంటే ఎక్కువ పెరిగితే రూ.85 చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు ఆదేశాలున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని