close
Array ( ) 1

తాజా వార్తలు

కరెంటు మిగిల్చిన కన్నీటిగాథ

విద్యుదాఘాతంతో తండ్రి మృతి, చావు బతుకుల మధ్య తల్లి

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: కూలీపని చేసైనా బిడ్డలను బాగా చదివించాలని పదేళ్ల కిందట నగరానికి వలసొచ్చారు..ఆ దంపతులు. విద్యుదాఘాతం ఆ కుటుంబ పెద్దను కబళించగా అతడిని రక్షించబోయిన భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమను ఆదుకోవాలని ఆ పిల్లలు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ మానవీయ ఘటన సనత్‌నగర్‌ పరిధిలో చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అన్నుపురం గ్రామానికి చెందిన బొమ్మాళి మల్లేశు(43), ఆయన భార్య సరస్వతిలకు ఓ కుమారుడు, మరో కుమార్తె ఉన్నారు. తమ బిడ్డలను బాగా చదివించాలని నగరానికి వచ్చి బోరబండలో ఉంటూ భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. తద్వారా వచ్చే డబ్బును స్వగ్రామంలో అమ్మమ్మ, తాతల వద్ద ఉంటున్న పిల్లలకు పంపేవారు. వీరి పిల్లల్లో కృష్ణ ఇటీవల ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఐటీఐలో శిక్షణ పొందుతున్నాడు. కూతురు ఝాన్సీ డిగ్రీ చదువుకుంటోంది.

విద్యుదాఘాతం.. వారి కుటుంబానికి శరాఘాతం.. మల్లేశు, సరస్వతిలు గుత్తేదారు ద్వారా ఈ నెల 13న బోరబండ ప్రాంతం కబీర్‌నగర్‌లో ఓ ఇంట్లో పనికి వెళ్లారు. అక్కడ పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇనుప కడ్డీలను పైఅంతస్తులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా హైటెన్షన్‌ తీగలు తగిలి మల్లేశు హాహాకారాలు చేశాడు. అక్కడే ఉన్న భార్య మరో ఇనుప పరికరంతో అతడిని పక్కకు తప్పించాలని చూసింది. ఈ క్రమంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురయ్యింది. ప్రమాదంలో మల్లేశు అక్కడికక్కడే మృతి చెందగా సరస్వతి తీవ్రంగా గాయపడింది. వైద్యులు ఆమె ఒక చేతిని తొలగించారు. సుమారు 90శాతం కాలిన గాయాలైన బాధితురాలని ప్రస్తుతం విశాఖపట్నం ప్రభుత్వాసుపత్రికి మార్చారు.

నష్ట పరిహారం అందజేత.. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ గుత్తేదారు రూ. 4.5లక్షలు, భవన యజమాని బాధ్యతగా మరో రూ.3.5లక్షలు ఇస్తానని పత్రాలు రాసిచ్చారు. మధ్యవర్తిత్వం వహించిన మాజీ ప్రజాప్రతినిధి మల్లేశు బిడ్డలను పిలిపించి రూ.లక్ష ఇప్పించాడు. కొందరు పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా మల్లేశు మృతదేహాన్ని స్వగ్రామం పంపించి వేశారు. మంగళవారం సనత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. సాయంత్రం కబీర్‌నగర్‌ బస్తీ పెద్దల సమక్షంలో సంబంధితులు బాధితురాలు సరస్వతి పేరిట ఫిక్స్‌డ్‌ చేయించిన రూ.7లక్షల నష్ట పరిహారాన్ని అందజేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.