close
Array ( ) 1

తాజా వార్తలు

ఎవరు చంపేశారో...?

నరవలో వృద్ధ దంపతుల హత్య

 దొంగలేనని పోలీసుల అనుమానం

 
కన్నీరుమున్నీరవుతున్న చిన్నకుమార్తె ఉమామహేశ్వరి

చిరునవ్వుతో చుట్టుపక్కల వాళ్లను పలకరిస్తూ... నిత్యం ధ్యానం, ఆధ్యాత్మిక సేవలతో ఎంతో ఆనందంగా జీవిస్తున్న ఆ వృద్ధదంపతుల్ని గుర్తుతెలియని దుండగులు నిర్థాక్షిణ్యంగా హతమార్చేశారు. బంగారు ఆభరణాల కోసమే ఇదంతా చేశారా...? లేక కావాలనే దంపతుల్ని హత్య చేసి... వెళ్తూ వెళ్తూ బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారా...? ఇవి కాక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా..? అని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -న్యూస్‌టుడే, వేపగుంట (నరవ)

జీవీఎంసీ 57వ వార్డు పరిధి నరవలో నివాసం ఉంటున్న జెర్రిపోతుల సముద్రం(63), ఆయన భార్య పార్వతీ(58) గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యకు గురైన సమాచారం గురువారం వెలుగులోకి రావడంతో... స్థానికంగా కలకలం రేగింది. పోలీసుల వివరాల మేరకు... ఆర్టీసీ మెకానిక్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన సముద్రం తన ముగ్గురు పిల్లలకు వివాహాలు చేశారు. ప్రస్తుతం భార్యతో కలిసి జీవిస్తున్నారు. బుధవారం వారి పెద్దకుమార్తె ఉదయం, రాత్రి రెండుసార్లు ఫోన్‌ చేసినా... తండ్రి తీయకపోవడంతో అనుమానం వచ్చి మిగిలిన సోదరి, సోదరుడికి సమాచారం అందించారు. వారంతా అదే రోజు రాత్రి తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటికి వచ్చి చూసే సరికి దంపతులిద్దరూ పడక గదిలోనే హత్యకు గురై కనిపించారు. తల్లి మెడలో ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమైనట్లు కుమార్తెలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని దుండగులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

తలదిండులు వినియోగించారా...?: మృతదేహాలకు వెనుకభాగంలో రెండు తలదిండ్లు ఉన్నాయి. వాటితోనే దంపతులకు ఊపిరి ఆడనీయకుండా గట్టిగా నొక్కి చంపేశారా...? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లోకి వెళ్లడం ఎలా అన్నది తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అంటున్నారు. బుధవారం రాత్రి ఆ ఇంటికి సమీపంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఆ హడావుడిలోనే దుండగులు ప్రణాళిక ప్రకారం ఈ చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తలకు స్థానికంగా ఎవరితోనూ విభేదాలు లేవని, వారు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు.

డీసీపీ, ఏడీసీపీ బృందం సందర్శన: క్రైం డీసీపీ సురేశ్‌బాబు, ఏడీసీపీ వేణుగోపాలనాయుడు, ఇతర సీఐలు, ఎస్‌ఐలు ఘటన జరిగిన ఇంటికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి... అనుమానితులను ప్రశ్నించారు. క్లూస్‌టీం సభ్యులు వేలుముద్రలను సేకరించారు. డాగ్‌స్వాడ్‌ బృందం పరిశీలనలో కుక్కలు సబ్బవరం రహదారిలో ఉన్న బెహరా కళాశాల వైపు వెళ్లి... మళ్లీ వెనక్కి వచ్చి ఆగాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.