అయ్యో..! అతని గుండె ఆగిపోయింది..!

తాజా వార్తలు

Updated : 30/03/2020 02:02 IST

అయ్యో..! అతని గుండె ఆగిపోయింది..!

ఆగ్రా: పొట్టకూటి కోసం ఊరు కాని ఊరు వచ్చాడు. కాయకష్టం చేసి నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాడు. దేశ రాజధాని చేరుకుని ఓ కంపెనీలో డెలివరీ ఏజెంట్‌గా జీవితం మొదలు పెట్టాడు. ప్రతి నెలా ఇంటికి డబ్బు పంపుతున్నాడు. జీవితం సాఫీగా సాగిపోతోంది. అయితే, కాలం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా.. పరీక్షిస్తుందో తెలియదు కదా. దేశాన్ని కరోనా కారు మేఘాలు కమ్ముతున్న వేళ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో సొంతూరు చేరుకునేందుకు రవాణా లేక నడిచి ఇంటికి వెళ్దామని బయలుదేరాడు. అడుగులో అడుగు వేసుకుంటూ కంటితో దూరాన్ని, కాళ్లతో కాలాన్ని కరిగించాలనుకున్నాడు. అయితే, తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడు. ఏ గుండె ధైర్యంతో నడక ప్రారంభించాడో ఆ గుండె చప్పుడు ఆగిపోయింది. తన స్వగ్రామానికి కాలినడన బయల్దేరి మధ్యమార్గంలో గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దేశాన్ని కరోనా పట్టి పీడిస్తున్న వేళ ఇదొక హృదయ విదారక ఘటన.

మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాకు చెందిన రణవీర్‌ సింగ్ అనే వ్యక్తి దిల్లీలో ఒక సంస్థలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పని లేకపోవడంతో 326 కి.మీ. దూరంలో ఉన్న తన సొంత గ్రామానికి కాలినడకన బయల్దేరాడు. అలా అతను ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో జాతీయ రహదారిపై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో దగ్గర్లోని దుకాణదారులు అతడికి సపర్యలు చేసి టీ, బిస్కెట్లు అందించారు. కొద్దిసేపటికే ఛాతీలో నొప్పిగా ఉందంటూ తన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండో నంబరు జాతీయ రహదారిపై వేల మంది వలస కూలీలు కాలినడకన సొంత గ్రామాలకు పయనమవడంతో వారికి కోసం నీళ్ల ప్యాకెట్లు, ఆహార పొట్లాలతో ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు సిద్ధంగా ఉన్నప్పటికీ రణవీర్‌ చనిపోవడం ఎంతో బాధాకరమని అర్వింద్ కుమార్‌ అనే పోలీసు అధికారి తెలిపారు. 

శనివారం వేల మంది వలస కూలీలు దేశ రాజధాని దిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల్లోని తమ సొంత గ్రామాలకు చేరుకొనేందుకు బస్టాండుకు చేరుకొన్నారు. దీంతో వీరిని తరలించేందుకు ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ రాష్ట్రాలు 1000పైగా బస్సులను ఏర్పాటు చేశాయి. అయితే బస్సులో చోటు దొరకని కొంతమంది కాలినడకన బయల్దేరారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా రోజువారీ, వలస కూలీలు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి భోజన, వసతి సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు తమ సొంత గ్రామాలకు చేరుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. చంటి పిల్లలను భుజాన వేసుకొని, బట్టలు మూట నెత్తిన పెట్టుకుని సొంత ఊళ్లకు నడచుకుంటూ వెళ్తున్న వలస కూలీల దృశ్యాలను చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని