అమ్మ లేదని.. ఇక తిరిగి రాదని తెలియక..

తాజా వార్తలు

Published : 28/05/2020 02:25 IST

అమ్మ లేదని.. ఇక తిరిగి రాదని తెలియక..

ముజఫర్‌పూర్‌: అమ్మ లేదు.. ఇక తిరిగి రాదని తెలియదు పాపం ఆ పసివాడికి. అందుకే రైల్వే స్టేషన్‌లో నిర్జీవంగా పడివున్న తన తల్లి మృతదేహంపై కప్పి ఉంచిన వస్త్రంతో ఆడుకుంటున్న దృశ్యం అందరి హృదయాలను కలిచివేస్తోంది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు బయల్దేరి వెళ్తున్న వలస కూలీల బతుకులు ఇలా మధ్యలోనే ఛిద్రమైపోతున్నాయి. తద్వారా ఆయా కుటుంబాలకు అంతులేని విషాదాన్ని మిగిలుస్తున్నాయి. తాజాగా ఓ మహిళ ఆకలితో అలమటించి, డీహైడ్రేషన్‌కు గురై నీరసించి మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లో శనివారం ఆమె రైలెక్కింది. సోమవారం ముజఫర్‌పూర్‌ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం వద్ద ఉంచగా.. తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని ఆ పసి హృదయం ఆమెను లేపేందుకు ప్రయత్నించడం అక్కడ ఉన్నవారిని కలిచి వేసింది. ఈ దృశ్యం అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డయింది. 

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉన్నచోట ఆదరించే దిక్కు లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారు. చివరకు తమ సొంతూరులోనైనా ఆసరా దొరుకుతుందేమోనన్న కొండంత ఆశతో వేల/ వందల కి.మీల మేర కాలినకడన, సైకిళ్లపైన బయల్దేరి వెళ్తున్నారు. ఇంకొందరైతే తమకు దొరికిన ట్రక్కో, ఆటోలనో పట్టుకొని సొంతూరు బాట పడుతున్నారు. ఈ క్రమంలో డస్సిపోయి, ఆకలికి తట్టుకోలేక, రోడ్డు ప్రమాదాలకు గురై అనేకమంది ఇంటికి చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్న విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని