క్షమించండి: జైలునుంచి విడుదలైన మను శర్మ

తాజా వార్తలు

Published : 06/06/2020 03:16 IST

క్షమించండి: జైలునుంచి విడుదలైన మను శర్మ

మోడల్‌ కుటుంబ సభ్యులకు వేడుకోలు

దిల్లీ: సంచలనం సృష్టించిన నాటి జెస్సికా లాల్‌ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవించిన మను శర్మ ఇటీవల తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. 43 ఏళ్ల మను శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన వల్ల ఎంతో క్షోభ అనుభవించిన జెస్సికా కుటుంబ సభ్యులను క్షమించమని అడిగారు. జైలుకు వెళ్లాల్సి రావటం ఎవరికైనా భయంకర అనుభవమని, 17 సంవత్సరాల జైలు జీవితంలో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. మను శర్మను తాము క్షమించామంటూ మృతురాలు జెస్సికా సోదరి సబ్రినా లాల్‌ తిహార్‌ జైలు అధికారులకు గతంలో లేఖ రాశారు. ఈ విషయంపై శర్మ స్పందిస్తూ... ఆమెకు, వారి కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పేందుకు తనకు మాటలు చాలటం లేదన్నారు. వారికి తనవల్ల అంతులేని వేదన కలిగిందని... అందుకు తనను మన్నించాలని కోరారు. వారి గొప్ప మనసుకు తాను జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.

ఒక్క నిముషం చాలు...

ఆనాటి ఘటన గురించి మాట్లాడుతూ... జీవితం పూర్తిగా మారిపోయేందుకు ఒక్క నిముషం కూడా పట్టదని... జీవితాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు. సంఘటన జరిగినప్పుడు తన వయస్సు కేవలం 23 సంవత్సరాలని... తాను ఎవరికీ హాని చేయాలని అనుకోలేదన్నారు. జరిగిన సంఘటనకు తను చాలా బాధ పడుతున్నానని వెల్లడించారు. తను చేసిన తప్పునకు తన తల్లితండ్రులు ఫలితం అనుభవించారని.. అందుకు వారు తనను క్షమించాలని కోరాడు.

అక్కడే నేర్చుకున్నా...

జైలు జీవితం తన కళ్లు తెరిపించిందని మను శర్మ తెలిపారు. తనను ఉంచిన తిహాడ్‌ జైలులో 500 మందికి కేవలం ఐదు టాయిలెట్లు మాత్రమే ఉండేవని ఆయన అన్నారు. జైలు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని .. అయితే కష్టాలను ఎదుర్కొని నిలబడటం కూడా అక్కడే నేర్చుకున్నట్టు చెప్పారు. శిక్షాకాలంలో కూడా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా నేరస్తులు, వారి కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు జైలు అధికారులకు సహకరించినట్టు ఆయన తెలియచేశారు.

విడుదల చేయొద్దంటూ...

తనను విడుదల చేయకూడదంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ నటి విద్యాబాలన్‌తో సహా పలువురు కోరుతున్న విషయం గురించి మను స్పందించారు. చేసిన దానికి తాను ఇప్పటికే శిక్ష అనుభవించానని... అది గమనించి తను మిగిలిన జీవితం ప్రశాంతంగా గడిపేందుకు అందరూ అంగీకరించాలన్నారు. 21 సంవత్సరాల క్రితం జరిగిన ఓ దుస్సంఘటన ఇంతటితో సమాప్తం అయినందుకు ఆయన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకమీద ప్రశాంతంగా, అర్థవంతమైన జీవితం గడుపుతానని... జైలుశిక్ష అనుభవిస్తున్న వారి పిల్లలకు సహాయం చేయటం వంటి సేవా కార్యక్రమాలు చేపడతానని మను శర్మ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని