close

తాజా వార్తలు

Published : 05/07/2020 08:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్థలాలు.. ఫ్లాట్ల పేరిట బురిడీ

రెండేళ్లలో రూ.156 కోట్లు కొల్లగొట్టిన ఘనుడు
ముగ్గురు నిందితుల అరెస్టు

హైదరాబాద్‌: ఇళ్లు.. ఫ్లాట్లు.. స్థలాలు ఇప్పిస్తామంటూ తెలివిగా గొలుసుకట్టు పథకంలో సభ్యులుగా చేర్పించుకుని రెండేళ్ల వ్యవధిలో రూ.156 కోట్లు కొల్లగొట్టిన ఉదంతమిది. ఇందులో చిక్కుకుని 1,450 మంది మోసపోయారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ శనివారం ఈ వివరాలను ఇక్కడ వెల్లడించారు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో నివాసముంటున్న యార్లగడ్డ రఘు.. రెండేళ్ల క్రితం శ్రీనగర్‌ కాలనీలో స్వధాత్రి ఇన్‌ఫ్రా పేరుతో రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఏడాది క్రితం మాదాపూర్‌లో రెండో శాఖను ఆరంభించాడు. ఇళ్లస్థలాలు, ఫ్లాట్లు అమ్మితే కమీషన్‌ ఇస్తానంటూ 30మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. భారీ కంపెనీగా కనిపించాలని 20 మంది టెలీకాలర్లతో కార్యాలయాన్ని నిర్వహించాడు. రఘుతో పాటు మరో ఇద్దరి వద్ద పెట్టుబడులకు సంబంధించిన వివరాల లెక్కలు సేకరించామని, ఇంకా ఎవరైనా బాధితులుంటే తమను సంప్రదించాలని సజ్జనార్‌ కోరారు.

రూ.లక్ష పెట్టుబడి... నెలకు రూ.7,800 లాభం
రఘు మూడు పథకాల ద్వారా ఏజెంట్లు, ప్రజలను ప్రలోభపెట్టాడు. తొలి ఫైనాన్స్‌ పథకంలో రూ.లక్ష మదుపు చేస్తే నెలకు రూ.7,800 లాభం ఇస్తామని చెప్పాడు. రెండో పథకంలో తమ వద్ద ఎవరైనా ప్లాట్లు కొంటే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వరకూ నెలకు 4 నుంచి 10శాతం లాభం చెల్లిస్తామని ప్రచారం చేశాడు. మూడో పథకంలో.. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను కొంటే జీఎస్టీ మినహాయింపుతో పాటు 70శాతానికే ఫ్లాట్‌ ఇచ్చేస్తానంటూ ప్రకటించాడు. ఫైనాన్స్‌ పథకంలో 950 మంది మదుపు చేశారు. వీరి నుంచి రఘు రూ.87 కోట్లు వసూలు చేశాడు. ఇళ్లు, స్థలాలు, ఫ్లాట్లు ఇప్పిస్తానంటూ 500మంది నుంచి రూ.69 కోట్లు కొల్లగొట్టాడు.

ఎంసీఏ చదివి.. ఐబీఎంలో పనిచేసి..
విజయవాడకు చెందిన యార్లగడ్డ రఘు.. ఇరవై ఏళ్ల క్రితం ఎంసీఏ పూర్తిచేశాడు. 2008-09లో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మిషన్స్‌(ఐబీఎం)లో సాంకేతిక నిపుణుడిగా పనిచేశాడు. రెండేళ్లు విజయవాడలోని అధ్యాపకుడిగా విధులు నిర్వహించాడు. జీతం సరిపోక రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఏజెంట్‌గా చేరాడు. సులభంగా రూ.కోట్లు సంపాదించేందుకు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చి స్వధాత్రి ఇన్‌ఫ్రాను ప్రారంభించాడు. మోసానికి పాల్పడిన రఘు, శ్రీనివాసరావు, మీనాక్షిలను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని