పరవాడ ఘటనలో ఒకరి మృతి
close

తాజా వార్తలు

Published : 15/07/2020 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరవాడ ఘటనలో ఒకరి మృతి

విశాఖపట్నం: పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో ఉన్న సాల్వెంట్స్‌ కంపెనీలో ట్యాంకర్‌ పేలిన ప్రమాదంలో సీనియర్‌ కెమిస్ట్‌ మృతి చెందాడు. సోమవారం రాత్రి సీనియర్‌ కెమిస్ట్‌ కాండ్రేగుల శ్రీనివాసరావు ‌(40) విధులకు హాజరయ్యాడు. పరిశ్రమలో పేలుడు ఘటన తర్వాత అతని ఆచూకీ తెలియలేదు. మంగళవారం ఉదయం శిథిలాల మధ్య ఉన్న శ్రీనివాసరావు  మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. దీనిపై కంపెనీ యాజమాన్యం, పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. పేలుడు ఘటనలోనే శ్రీనివాసరావు  మృతి చెందాడని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ (33) గాజువాకలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

పేలుడు జరిగిన సమయంలో పరిశ్రమలో నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నట్టు యాజమాన్యం చెబుతున్నప్పటికీ దాదాపు 15 మంది వరకు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సంఘటనలో సుమారు 15 నుంచి 20 రసాయన డ్రమ్ములు పేలాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సాల్వెంట్‌ పరిశ్రమలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఆర్డీవో పెంచల కిషోర్‌ తెలిపారు.

రాంకీ ఫార్మా వద్ద భారీ బందోబస్తు

 పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. యాజమాన్యం వైఫల్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరిశ్రమ వద్ద ఆందోళన చేసేందుకు వెళ్తున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... భద్రతా ప్రమాణాలు అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన పరిశ్రమ దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లకుండా అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. రాంకీ ఫార్మా సంస్థ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

 

 

 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని