రూ.లక్షలు కొల్లగొడుతున్న కి‘లేడి’
close

తాజా వార్తలు

Published : 13/08/2020 07:24 IST

రూ.లక్షలు కొల్లగొడుతున్న కి‘లేడి’

నకిలీ వాట్సాప్‌ సందేశాలు పంపిస్తూ నగదు లాగేస్తూ..

హైదరాబాద్‌: అమెరికా, ఐరోపా దేశాల్లో విదేశీ స్నేహితులున్న హైదరాబాదీయులను ఎంచుకుని తమకు రూ.లక్షల్లో ఆర్థిక సాయం కావాలంటూ నకిలీ వాట్సాప్‌ సందేశాలు పంపిస్తూ రూ.లక్షలు నగదు బదిలీ చేయించుకుంటున్న సైబర్‌ నేరస్థుల వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. ఇదంతా చేస్తోంది ఓ యువతిగా గుర్తించారు. వారం రోజుల కిందట ఓ ఉపాధ్యాయుడికి అమెరికాలో ఉన్న ఆయన స్నేహితుడు అభ్యర్థించినట్లు వాట్సాప్‌ సందేశం పంపించి, ఉపాధ్యాయుడి ద్వారా రూ.3 లక్షలు బ్యాంకు ఖాతాలోకి జమ చేయించుకుంది. డబ్బు ముట్టిందా? అని ఉపాధ్యాయుడు అమెరికా స్నేహితుడికి ఫోన్‌ చేయగా.. తాను డబ్బు అడగలేదంటూ ఆయన స్పష్టం చేశాడు. దాంతో బాధితుడు ఆరు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చిన్న ఆధారం దొరకడం.. దాని ద్వారా ముందుకు వెళ్లగా.. మహారాష్ట్రలో ఉంటున్న యువతి ఇదంతా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

బేగంపేట బ్యాంక్‌ ఖాతాతో దొరికిన ఆధారం..

ఉపాధ్యాయుడికి వాట్సాప్‌ సందేశం పంపించిన కి‘లేడి’ బ్యాంక్‌ ఖాతా బేగంపేటలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ది. పోలీసులు సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బ్యాంక్‌ ఖాతాను తదుపరి లావాదేవీలు జరగకుండా స్తంభింపజేయాలంటూ బ్యాంక్‌ అధికారులను కోరడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఖాతాలో లావాదేవీలు ఆగిపోయాయి. రెండు రోజుల కిందట ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బ్యాంక్‌ అధికారులకు ఫోన్‌ చేయగా.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మీ ఖాతాను స్తంభింపజేయాలంటూ ఆదేశించారని చెప్పారు. దీంతో బుధవారం ఆ యువకుడు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ ఠాణాకు రాగా.. ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ ఆయనను విచారించారు. తన స్నేహితురాలు కొద్దిరోజుల కిందట ఫోన్‌ చేసి నీ బ్యాంక్‌ ఖాతాలో రూ.3 లక్షలు జమ చేస్తున్నాం.. మళ్లీ నాకు బదిలీ చేయాలంటూ కోరగా.. అంగీకరించానని, రూ.3 లక్షలు జమ కాగానే ఆమె ఖాతాకు బదిలీ చేశానంటూ వివరించాడు. అయిదేళ్ల కిందట తాను ఉన్నత విద్య కోసం ఫ్రాన్స్‌ వెళ్లానని అక్కడ తనకు పరిచయమైందన్నారు. పుణెలో ఉంటున్నానంటూ చెప్పిందన్నారు. తిరిగి భారత్‌కు వచ్చాక అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నామని, ఇదంతా తనకు తెలియదన్నారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్నేహితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని