close

తాజా వార్తలు

Updated : 21/10/2020 08:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్యం మత్తు... ఆపై చేతిలో తుపాకీ!

ఎదురు సమాధానమిచ్చాడని హతమార్చేశాడు
విజయవాడలో మహేష్‌ హత్య కేసులో వీడిన గుట్టు
సెటిల్‌మెంట్ల కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చిన నిందితులు
ఈనాడు డిజిటల్‌ - విజయవాడ

మ్మాయిల విషయం మాట్లాడుకుంటున్నారనే అనుమానం.... దానిపై ప్రశ్నిస్తే తాను పోలీసు శాఖ ఉద్యోగినంటూ ఎదురు సమాధానం ఇవ్వడం అతనికి తీవ్ర కోపం తెప్పించింది.... పైగా మద్యం మత్తు తోడవడం, చేతిలో తుపాకీ ఉండడంతో విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపాడు. ఒకరి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌ ఉద్యోగి గజిగంటి మహేష్‌(33) హత్యలో ప్రధాన నిందితుడైన బీరం సాకేత్‌రెడ్డి కథ ఇది... విజయవాడలో సెటిల్‌మెంట్లు, తెనాలిలో కిడ్నాపుల కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చిన సాకేత్‌రెడ్డి... మహేష్‌ను అకారణంగా హత మార్చినట్లు పోలీసులు తేల్చారు. వివరాలను విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు మంగళవారం విలేకరులకు వెల్లడించారు.

బిహార్‌ తుపాకీ కొనుగోలు
కడప ఎస్‌బీఐ కాలనీకి చెందిన బీరం సాకేత్‌రెడ్డి హైదరాబాద్‌లో కన్సల్టెంట్‌, ఇంటీరియర్‌ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అక్కడ గతంలో జరిగిన వివాదంలో సాకేత్‌పై ఓ హోటల్‌ యజమాని చేయిచేసుకున్నాడు. అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బిహార్‌కు వెళ్లి   తుపాకీ, 12 తూటాలను కొనుగోలు చేశాడు. తిరిగివచ్చి తన పాత సహచరుడు, తెనాలి వాసి సందీప్‌ను సంప్రదించాడు. విజయవాడ మధురానగర్‌కు చెందిన ఓ వ్యక్తి కారణంగా తాను రూ.2 లక్షలు నష్టపోయానని, అతన్ని బెదిరించాలని సందీప్‌ కోరాడు. అదేసమయంలో తెనాలికి చెందిన ఓ వ్యాపారిని అపహరిస్తే రూ.కోటి వరకు వస్తుందని ఆశ పుట్టించాడు. దీంతో మరో స్నేహితుడు, ఏలూరు వాసి జాన గంగాధర్‌ అలియాస్‌ గంగూభాయ్‌తో కలిసి ఈనెల 10న ఉదయం సాకేత్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుకున్నాడు. ఇద్దరూ హోటల్‌లో దిగారు.

విచక్షణ మరిచి కాల్పులు
పాత పరిచయస్థుడు ముదిరెడ్డి రాధాకృష్ణారెడ్డి సొంత ఆటోలో... తమతోపాటు తెలంగాణ నుంచి తెచ్చుకున్న మద్యం తాగేందుకు నున్న సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి సాకేత్‌, గంగాధర్‌లు వెళ్లారు. అదే సమయంలో మహేష్‌ అతని స్నేహితులు అక్కడ మద్యం తాగేందుకు వేచిచూస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న సాకేత్‌రెడ్డి వారి దగ్గరకు వచ్చి ‘‘ఎవడ్రా ఇక్కడ అమ్మాయిల గురించి మాట్లాడుతోంది?’’ అని ప్రశ్నిస్తూ వారి కారులో అమ్మాయి ఎవరైనా ఉందేమోనని చూశాడు. ఈ క్రమంలో తాను పోలీసు శాఖ ఉద్యోగినని మహేష్‌ గట్టిగా చెప్పడంతో... కోపానికి లోనైన సాకేత్‌ తుపాకీని బయటకు తీసి ఇష్టానుసారంగా కాల్పులు జరిపాడు. తూటాలు నేరుగా మహేష్‌కు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. గంగాధర్‌ ముఖానికి కూడా ఓ తూటా తగిలి, అతనికి స్వల్ప గాయమైంది.


ఆటో విప్పిన గుట్టు

సంఘటన స్థలం వద్ద ఆటోలో ముగ్గురు వ్యక్తులున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఆటో శాంతినగర్‌కు చెందిన రాధాకృష్ణారెడ్డిదని గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మిగతా నిందితుల గుట్టు వీడటంతో సాకేత్‌రెడ్డి, జాన గంగాధర్‌లను సైతం అరెస్టు చేశారు. వారి నుంచి మ్యాగజైన్‌తో కూడిన తుపాకీ, ఆటో స్వాధీనం చేసుకున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.