
తాజా వార్తలు
కట్టుకున్నోడు.. నట్టేట ముంచాడని..
పిల్లలకు విషమిచ్చి తల్లితో కలిసి ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
భర్త మరో వివాహం చేసుకున్నందుకు అఘాయిత్యం
రాజమహేంద్రవరం నేరవార్తలు: భర్త తనను వదిలేసి మరో వివాహం చేసుకున్నాడనే నిజం తెలిసిన ఓ వివాహిత మనస్తాపంతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తన తల్లితో సహా ఉరేసుకుంది. ఈ విషాదకర ఘటన రాజమహేంద్రవరంలో సోమవారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక తాడితోట అంబేడ్కర్‌నగర్‌కు చెందిన శివపావని(27)కి 12 ఏళ్ల కిందట విజయవాడకు చెందిన భూపతి నాగేంద్రకుమార్‌తో వివాహమైంది. వీరికి నిషాంత్(9), రితిక(7) ఇద్దరు పిల్లలున్నారు. భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని నాలుగేళ్ల కిందట రాజమహేంద్రవరం వచ్చి తల్లి ఎస్.కృష్ణవేణి(55) దగ్గర ఉంటోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. సెప్టెంబరులో రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్లో పావని తన భర్తపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు నాగేంద్రను పిలిపించి మాట్లాడారు. రెండు నెలల సమయం కావాలని, తరువాత వచ్చి పావనిని కాపురానికి తీసుకెళ్తానని నాగేంద్ర చెప్పాడు. ఆ గడువు పూర్తవడంతో భర్తను అడిగేందుకు పావని, తల్లి కృష్ణవేణి, బంధువులు మరో ఇద్దరు కలిసి ఈనెల 22న విజయవాడ వెళ్లారు. అక్కడ నాగేంద్ర కుటుంబీకులు అతడికి మరో పెళ్లి జరిగిందని, పావని వద్దకు రాడని చెప్పి దూషించడంతోపాటు దాడి చేశారు. వారి మాటలతో తీవ్ర మనస్తాపం చెందిన పావని సోమవారం ఉదయం పిల్లలకు శీతలపానీయంలో విషం కలిపి తాగించింది. అనంతరం తల్లి కృష్ణవేణితో సహా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నానికి విషయాన్ని గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి చిన్నారి రితిక కొనఊపిరితో ఉండడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఘటనాస్థలాన్ని అర్బన్ ఏఎస్పీ లతామాధురి, డీఎస్పీ సంతోష్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివగణేష్ తెలిపారు.