close

తాజా వార్తలు

Published : 28/11/2020 08:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసుల అదుపులో అంజమ్మ?

మావోయిస్టు అగ్రనేతలు సహా 64 మందిపై ఉపా చట్టం
  నిందితుల్లో పౌర హక్కుల సంఘాల నేతలు

ఈనాడు హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలతో పౌరహక్కుల సంఘాల నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గుంటూరు జిల్లా గణపవరంలో ఉన్న అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మను ఇదే కేసులో జి.మాడుగుల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈమె భర్త లక్ష్మయ్య 15 ఏళ్ల క్రితం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. పెదబయలు మండలానికి చెందిన మావోయిస్టుల సానుభూతిపరుడు నాగన్న ఇచ్చిన సమాచారం ఆధారంగానే 64 మందిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే, గాజర్ల రవి, రామచంద్రరెడ్డి ప్రతాపరెడ్డి అలియాస్‌ చలపతితో పాటు మరికొందరు మావోయిస్టు నేతలున్నారు. మరోవైపు మావోయిస్టు సానుభూతిపరురాలు రాజేశ్వరిపై పిడుగురాళ్ల పోలీసుస్టేషన్‌లో ఈ నెల 24న పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, పీపుల్స్‌వార్‌ మావోయిస్టు గ్రూపునకు చెందిన కంభంపాటి చైతన్య, మరో 26 మందిని గుంటూరు జిల్లా జూలకల్లులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హక్కులపై దాడికే..
ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నవారి గొంతులు నులిమి భయోత్పాతం సృష్టించడానికే పోలీసులు ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక సమన్వయ కమిటీ సభ్యులు జీవన్‌కుమార్‌, చంద్రశేఖర్‌ ఓ ప్రకటనలో ఆరోపించారు. హెచ్‌ఆర్‌ఎఫ్‌ సభ్యుడు వీఎస్‌ కృష్ణ, ఇతర హక్కుల, దళిత, సాహిత్య సంఘాల బాధ్యులపై విశాఖ జిల్లా ముంచంగిపుట్టు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు.. ఈ నెల 2న తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు ఆదివాసీ విద్యార్థి సంఘం నేతల్ని అరెస్టుచేసి కేసు నమోదు చేశారు. అదే కేసులో మానవహక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భుజంగరావు, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షురాలు సుగుణ, ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్‌ పేర్లున్నాయి. మరో 21 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో జతచేశారు.


Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని