
తాజా వార్తలు
జీవితాన్ని బలితీసుకున్న ఆన్లైన్ ఆట
రూ.లక్షలు నష్టపోయి యువకుడి ఆత్మహత్య
వనస్థలిపురం, న్యూస్‌టుడే: ఆన్లైన్ ఆటలు ఆ యువకుడి జీవితాన్ని బలి తీసుకున్నాయి. ఆ ఆటలకు చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ వనస్థలిపురం ఠాణా పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వనస్థలిపురం రైతుబజార్ ప్రాంతానికి చెందిన ఆళ్ల జగదీశ్(33) ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డబ్బు సంపాదించాలన్న మోజుతో జగదీశ్ గత కొంత కాలంగా ఆన్లైన్ గేమ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో సుమారు రూ.12 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. విషయం తెలియడంతో అతని తండ్రి వీరభద్రయ్య ఆ అప్పులన్నీ తీర్చేశాడు. తరవాత జగదీశ్.. కోల్పోయిన డబ్బును రాబట్టి, అప్పును తీర్చడానికి మళ్లీ ఆన్లైన్ గేమ్‌ల బాటనే ఎంచుకున్నాడు. దీంతో మరో రూ.12 లక్షల వరకు అప్పులయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని గురువారం రాత్రి సెల్ఫీ వీడియో తీశాడు. ‘తల్లిదండ్రులను, భార్యాపిల్లలను మోసం చేశాను. పిల్లల కోసం ఏమీ చేయలేకపోయాను. తనను క్షమించాలి.. తన పిల్లలను బాగా చూసుకో నాన్న’ అంటూ వీడియో ముగించాడు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.