
తాజా వార్తలు
నలుగురిని రక్షించి... ప్రాణాలు కోల్పోయి..!
ముంబయిలో మహిళా వలస కూలీ మృతి
కవిటిగ్రామీణం: పొట్టకూటి కోసం 15ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి ఓ కుటుంబం ముంబయికి వలస వెళ్లిపోయింది. వడేళ్ల క్రితం భర్త అనారోగ్యంతో అక్కడే మృతిచెందగా, తాజాగా భార్య కూడా అక్కడే దుర్మరణం చెందటంతో స్థానికంగా విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. కవిటి మండలం వింధ్యగిరి గ్రామానికి చెందిన అర్చకుడు పరశురాంరౌళో, ద్రౌపది స్థానికంగా ఉపాధి లేక పిల్లాపాపలతో ముంబయి వెళ్లిపోయారు. భర్త చనిపోయినా ద్రౌపది స్వస్థలానికి రాకుండా కూలిపనులు చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ద్రౌపది(53) ప్రభుత్వ మరుగుదొడ్డిలో ఉండగా శ్లాబు కదలడం గమనించి బిగ్గరగా కేకలు వేసింది. దీంతో పక్కనున్నవారు బయటకు పరిగెత్తారు. వారితో పాటు ఈమె కూడా పరిగెత్తే క్రమంలో కాలుజారి పడిపోయింది. శ్లాబ్ ఈమెపై కూలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో తోటి మహిళలు ఆవేదన చెందారు. కుమారుడు డిగ్రీ, కుమార్తె ఇంటర్ చదువుతున్నారు.