close

తాజా వార్తలు

Published : 30/11/2020 08:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.10 చూపిస్తే.. రూ.కోటి ఇస్తారు..!

వాట్సాప్‌ ద్వారా హవాలా లావాదేవీలు

విజయవాడలో భారీగా నగదు పట్టివేత


స్వాధీనం చేసుకున్న సొమ్ముతో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, సిబ్బంది

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ‘రూ.10 నోటు చూపిస్తే చాలు.. మీకు రూ.కోటి ఇచ్చేస్తారు..!’ అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. చాప కింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న హవాలా రాకెట్‌లో రూ.10 నోటే కీలకమైంది. పన్నులు ఎగ్గొట్టి రూ.కోట్ల మేర నగదును బెజవాడ నుంచి దేశంలో ఎక్కడికైనా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంతకల్‌కు హవాలా ద్వారా పంపించేందుకు సిద్ధంగా ఉన్న రూ.కోటి నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వాట్సాప్‌ గ్రూపు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా హవాలా ముఠా నిర్వహిస్తున్న ఈ లావాదేవీలను పోలీసులు రట్టు చేశారు.

వాట్సాప్‌లోనే అన్నీ... హవాలా ముఠా లావాదేవీలన్నీ వాట్సాప్‌లోనే సాగుతుంటాయి. ముందుగా ముఠా సభ్యులంతా కలిసి ఒక వాట్సాప్‌ గ్రూపుగా ఏర్పడతారు. తొలుత డబ్బును ఒక చోటకు చేరుస్తారు. ఆ తర్వాత ఎవరికి, ఎలా ఇవ్వాలో ప్రధాన సూత్రధారి నిర్ణయిస్తారు. డబ్బును ఎవరు తీసుకుంటారో.. వారికి ఒక రూ.10 నోటు ఇస్తారు. దీనికి ముందు ఆ నోటు ఫొటో తీసి హవాలా సభ్యుడికి వాట్సాప్‌ ద్వారా పంపిస్తారు. రూ.10 నోటు తీసుకున్న వ్యక్తి తనకు కావాల్సిన చోటుకు వెళ్లి, అక్కడున్న హవాలా సభ్యుడికి ఆ నోటు ఇస్తారు. నోటు మీద ఉన్న సీరియల్‌ నెంబరే నగదు లావాదేవీల కోడ్‌గా పరిగణిస్తారు. కోడ్‌ సరిపోలితే నోటు తెచ్చిన వ్యక్తికి హవాలా సొమ్ము మొత్తం ఇచ్చేస్తారు. ఇలా రూ.10 నోటే హవాలా రాకెట్‌లో ప్రధాన భూమిక పోషిస్తోంది. దీన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి గుంతకల్‌కు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రూ.కోటి నగదును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

చరవాణి వ్యాపారం చేసే వారిగా గుర్తింపు... రూ.కోటి నగదు హవాలా ద్వారా రవాణా అవుతున్నట్లు సమాచారం రావటంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడులు చేశారు. విజయవాడకు చెందిన ఇంద్రసింగ్‌, గుంతకల్‌కు చెందిన ఉదయ్‌ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని తనిఖీ చేయగా రూ.కోటి నగదు దొరికింది. వీరిద్దరూ చరవాణులు వ్యాపారం చేసే వారిగా గుర్తించారు. వీరిద్దరూ కాక గుంతకల్‌లో ప్రధాన సూత్రధారి ఒకరు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నగదు మొత్తం ఎక్కడిది? ఎక్కడి నుంచి సేకరించారు? ఎవరికి ఇస్తున్నారు? తదితర విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ నగదును విజయవాడలో పలువురి నుంచి సేకరించినట్లు సమాచారం. ఇదంతా లెక్కల్లో ఉన్న సొమ్మా? లేక నల్లధనమా? అనేది తేలాల్సి ఉంది. గుంతకల్‌కు చెందిన ప్రధాన సూత్రధారి పట్టుపడితే.. ఇది ఎవరి సొమ్ము అనేది తేలిపోతుందని పోలీసులు అంటున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన